OTT-Web Series: సినిమాతో చెప్పలేని కథలను.. ఓటీటీలో చెప్పేందుకు సై అన్న స్టార్స్‌

9 Jul, 2022 07:59 IST|Sakshi

సినిమాని థియేటర్లో చూస్తే ఆ అనుభూతే వేరు అని సినీ ప్రముఖులు అంటుంటారు. ఇది నిజమే. అయితే సినిమాలో చెప్పలేని కొన్ని కథలు ఉంటాయి. అవి ఓటీటీలో చెప్పడానికి కుదురుతాయి. ఇలాంటి కథలకు స్టార్స్‌ ఓకే చెప్పి, ఓటీటీ ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్‌ ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఓటీటీకి ‘ఊ’ చెప్పిన తారల గురించి తెలుసుకుందాం.

బాబాయ్‌-అబ్బాయ్‌ల ‘రానా నాయుడు’ 
హీరోలు వెంకటేశ్, రానా కలిసి తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌ చేశారు. సుపన్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఇటీవల పూర్తయింది. అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా ‘రే డోనోవన్‌’ ఆధారంగా ‘రానా నాయుడు’ రూపొందింది. ఈ వెబ్‌ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళ్, ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. బాబాయ్‌ వెంకీ – అబ్బాయ్‌ రానా నటించిన ఈ సిరీస్‌ని త్వరలోనే స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది.

‘దూత’తో వస్తున్న నాగ చైతన్య
మేనమామ వెంకటేశ్, బావ రానాలానే నాగచైతన్య కూడా ఓటీటీకి సై అన్నారు. ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారర్, థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది.  ఈ సిరీస్‌ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కానుంది. కాగా అక్కినేని కుటుంబంతో ‘మనం’లాంటి మెమరబుల్‌ హిట్‌ ఇచ్చిన విక్రమ్‌ కె. కుమార్‌ ‘దూత’లో నాగచైతన్యను డిఫరెంట్‌ లుక్‌లో చూపించనున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదల కానుంది.

సుశాంత్‌ నీళ్ల ట్యాంక్‌
హీరో సుశాంత్‌ ‘మా నీళ్ల ట్యాంక్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్నారు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు.  ‘లీడర్‌’ చిత్రంతో తెలుగుకి పరిచయమైన ప్రియా ఆనంద్‌  ఆ తర్వాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించారు. పదేళ్ల తర్వాత ‘మా నీళ్ల ట్యాంక్‌’తో తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒక ఫీల్‌ గుడ్‌ పల్లెటూరి కథాంశంతో రొమాంటిక్‌ కామెడీ  నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందింది. 

రాజ్‌ తరుణ్‌ పెళ్లంట
యువ హీరో రాజ్‌ తరుణ్‌ తొలిసారి ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. ‘ఏబీసీడీ’ చిత్ర దర్శకుడు సంజీవరెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌లో శివానీ రాజశేఖర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికూతురు తన ప్రియుడితో వెళ్లిపోతే పెళ్లి కుమారుడి పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వారిద్దరిపై ఎలా పగ తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ఈ సిరీస్‌ రూపొందుతోంది. తమడ మీడియా, జీ 5 భాగస్వామ్యంలో రాహుల్‌ తమడ, సాయిదీప్‌ రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు.

పులి మేక ఆడుతున్న ఆది 
ఆది సాయికుమార్‌ ‘పులి-మేక’ ఆటకు సిద్ధమయ్యారు. తొలిసారి ఆయన ‘పులి–మేక’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. గోపీచంద్‌ ‘పంతం’ మూవీ ఫేమ్‌ కె. చక్రవర్తి రెడ్డి ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆదికి జోడీగా లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. జీ5, కోన ఫిలిం కార్పొరేషన్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నాయి. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చుట్టూ తిరిగే క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ రూపొందుతోంది. పోలీస్‌ అధికారులను టార్గెట్‌ చేసి చంపుతున్న సీరియల్‌ కిల్లర్‌ నేపథ్యంలో కథ ఉంటుందట. 

మరిన్ని వార్తలు