Srikanth Addala: నారప్ప సినిమాను నాన్‌స్టాప్‌గా చిత్రీకరించాం

19 Jul, 2021 15:11 IST|Sakshi

Srikanth Addala About Narappa: నారప్ప.. మే 14న థియేటర్లలో రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడప్పుడే పరిస్థితులు చక్కబడేలా కనిపించకపోవడంతో నారప్ప ఓటీటీ బాట పట్టింది. రేపటి (జూలై 20) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ అడ్డాల మీడియాతో ముచ్చటించాడు. ఈ సినిమా విశేషాలను, డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు గల కారణాలను వెల్లడించాడు.

'అసురన్‌ రీమేక్‌ తీయాలని సురేశ్‌ బాబు ఫిక్సయ్యారు, రీమేక్‌ రైట్స్‌ కూడా కొనుక్కున్నారు. అప్పుడే నేను కూడా ఈ సినిమా చేస్తానని చెప్పడంతో డైరెక్టర్‌గా నాకీ అవకాశమిచ్చారు. ఈ జానర్‌ను టచ్‌ చేయడం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం వెంకటేశ్‌ చాలా కష్టపడ్డాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని సీన్లలో ఆయన జీవించడాన్ని చూసి సెట్‌లో నాకు నోట మాటలు రాలేవు. ఆయనకు జోడీగా ప్రియమణి అయితే బాగుండనిపించి ఆమెను సెలక్ట్‌ చేశాం.

ఈ సినిమా కోసం సుమారు 58 రోజులు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరిపాం, చివరి ఐదు రోజులైతే బ్రేక్‌ ఇవ్వమని యూనిట్‌ అంతా అడిగింది, కానీ కుదరదన్నాం. అంత కష్టపడి తీసిన సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవడం మాకూ బాధగానే అనిపించింది. పైగా పెద్ద సినిమా కావడంతో మొదటి నుంచీ థియేటర్లలోనే రిలీజ్‌ చేద్దామనుకున్నాం. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఓటీటీకి వెళ్లక తప్పలేదు. దీనివల్ల హీరో వెంకటేశ్‌ కూడా నిరాశ చెందాడు' అని శ్రీకాంత్‌ అడ్డాల చెప్పుకొచ్చాడు. కాగా తమిళ బ్లాక్‌బస్టర్‌ మూవీ 'అసురన్‌'కు రీమేక్‌గా నారప్ప తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్‌, ప్రియమమణి, కార్తీకర్‌ రత్నం, వశిష్ట సింహ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేశ్‌ బాబు, కలైపులి థాను నిర్మించారు.

మరిన్ని వార్తలు