F3 Movie Celebrations: ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలను ఇక్కడే తీశాం: వెంకటేశ్‌

5 Jun, 2022 08:41 IST|Sakshi

మహిళల ఆదరణతోనే ఎఫ్‌–3 విజయం

హీరో వెంకటేశ్‌

బీచ్‌రోడ్డులో ఎఫ్‌–3 ఫన్‌టాస్టిక్‌ సెలబ్రేషన్స్‌

F3 Success Meet Vizag, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మహిళా ప్రేక్షకుల ఆదరణ వల్లే ఎఫ్‌–3 (F3) సినిమా అఖండ విజయం సాధించిదని ప్రముఖ హీరో వెంకటేశ్ తెలిపారు. ఆర్‌.కె.బీచ్‌ దరి గోకుల్‌పార్కులో శనివారం రాత్రి ఎఫ్‌–3 ఫన్‌టాస్టిక్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తనకెప్పుడూ స్పెషల్‌ అన్నారు. తన తొలి సినిమా కలియుగ పాండవులు షూటింగ్‌ విశాఖ బీచ్‌రోడ్డులోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలను విశాఖలో చిత్రీకరించామన్నారు. తాను నటించిన దృశ్యం–2, నారప్ప వంటి సినిమాలు ఓటీటీలో మాత్రమే విడుదల కావడంతో తన అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారని పేర్కొన్నారు. ఎఫ్‌–3 సినిమాకు అభిమానులు విజయం చేకూర్చారని సంతోషం వ్యక్తం చేశారు. 

మరో హీరో వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ 'అభిమానుల ఆదరణే తమకు వందకోట్ల ఆదాయంతో సమానం. విశాఖ నోవాటెల్‌ హోటల్‌లోనే దర్శకుడు అనిల్‌ ఎఫ్‌–3 సినిమా కథ రాసుకున్నారు. మళ్లీ అవకాశం వస్తే కథ వినకుండానే వెంకటేశ్‌తో సినిమా చేస్తాను.' అని పేర్కొన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ విశాఖలో ఆర్య, పరుగు సినిమా షూటింగ్‌ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అమెరికాలో కూడా ఇదే ఆదరణ లభించడం అపూర్వమన్నారు. ఈ రోజుకు సినిమా విడుదలై 9 రోజులవుతుందని.. రూ.100 కోట్ల గ్రాస్‌ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జగదాంబ వంటి 1,100 సీట్లు ఉన్న థియేటర్‌లో ఎఫ్‌–3 హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోందని జగదాంబ థియేటర్‌ అధినేత జగదీష్‌ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్‌–4 త్వరలోనే ప్రకటిస్తామన్నారు. 

'విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు ముందు నేను చేసిన చాలెంజ్‌తో మీడియా కూడా షాక్‌ అయింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను నేను, హీరో వెంకటేశ్‌ ఎంతో రుచి చూశాం' అని నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ కేవలం ప్రేక్షకులను నవ్వించడానికే ఈ సినిమా తీశానన్నారు. ఈ సినిమాలో ఆలీ పాత్ర నచ్చిందా అని ప్రేక్షకులను అడిగారు. తనకు ఎఫ్‌–2 కంటే ఎఫ్‌–3 సినిమా అంతకుమించి ఆనందం ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చాలా బాగా పండాయన్నారు. తన సినిమా కథలన్నీ వైజాగ్‌లోనే రాసుకున్నానని చెప్పారు. 

జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ ఎఫ్‌–3 చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇదే రోడ్డుపై ఎన్నో షూటింగ్‌లు చేశానని నటుడు అలీ చెప్పారు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ఈస్ట్‌ డిస్ట్రిబ్యూటర్‌ శివరామ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్, అనిల్‌ సినిమాలోని ఓ పాటకు నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు.  

సే నో టు ప్లాస్టిక్‌ 
ఎఫ్‌–3 విజయోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ విశాఖలో ఆదివారం నుంచి ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేస్తున్నామన్నారు. విశాఖను ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీగా మారుస్తున్నట్లు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ విశాఖను ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీగా చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యపడుతుందన్నారు.   

మరిన్ని వార్తలు