టాలీవుడ్‌లో విషాదం : సీనియర్‌ నటుడు కన్నుమూత

28 Jul, 2020 17:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు, రచయిత రావి కొండలరావు మంగళవారం కన్నుమూశారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, జర్నలిస్టుగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. కాగా, 1958లో శోభ చిత్రంలో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తేనె మనసులు, దసరా బుల్లోడు, భైరవ ద్వీపం, రంగూన్‌ రౌడీ, చంటబ్బాయ్‌, పెళ్లి పుస్తకం, మేడమ్‌,  రాధాగోపాలం, మీ శ్రేయాభిలాషి, వరుడు, కింగ్‌, ఓయ్‌.. వంటి చిత్రాల్లో ఆయన నటించారు. 600కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. తమిళ, మలయాళ సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేశారు. 

కాగా, కొండలరావు భార్య, ప్రముఖ నటి రాధా కుమారి 2012లో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విభిన్న పాత్రల్లో కనిపించిన ఆమె.. దాదాపు 600లకు పైగా చిత్రాలు చేశారు. వీరిద్దరు జంటగా కూడా పలు చిత్రాల్లో నటించారు.


రావి కొండలరావు మృతి పట్ల సీఎం జగన్‌ సంతాపం
బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడిగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారని అన్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లైందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

మరిన్ని వార్తలు