RIP Jayanthi: తొలి సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ ట్యాగ్‌

26 Jul, 2021 13:34 IST|Sakshi

నృత్యం ఆమెకున్న బలం. అయితే బొద్దు రూపం తన సినిమా కలకు అడ్డం పడింది. కానీ, ఏదో ఒకనాటికి నటిగా రాణిస్తానని తనకు తానుగా ఆమె చేసుకున్న శపథం.. నెరవేరడానికి ఎంతో టైం పట్టలేదు. అనుకోకుండా దక్కిన అవకాశం.. ఆ సినిమా అద్భుత విజయం ఆమెను బిజీ హీరోయిన్‌ను చేసింది. సంప్రదాయ హీరోయిన్‌ మార్క్‌ను చెరిపేసి కన్నడలో తొలి గ్లామర్‌ డాల్‌గా నిలిచింది జయంతి. మూడు దశాబ్దాలపాటు దక్షిణాది సినిమాల్లో అగ్ర కథనాయికగా హీరోయిన్‌గా.. ఆపై హుందా పాత్రలతో అలరించింది. ముఖ్యంగా సొంత గడ్డపై ‘అభినయ శార్దూలే’(నటనా శారదా-నటనా దేవత)గా పిల్చుకునే స్థాయికి చేరుకుందామె. అందుకే  అభిమానులు.. ఆ దిగ్గజ నటి లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: జనవరి 6, 1945లో బళ్ళారిలో పుట్టింది కమలా కుమారి అలియాస్‌ జయంతి. తండ్రి బాలసుబ్రహ్మణ్యం ఇంగ్లీష్‌ టీచర్‌. తల్లి సంతాన లక్ష్మి, కమలా కుమారితో పాటు ముగ్గురు అక్కాచెళ్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. చిన్నప్పుడే భర్త నుంచి వేరుపడిన సంతాన లక్ష్మి.. పిల్లల్ని తీసుకుని మద్రాస్‌కు మకాం మార్చేసింది. చిన్నతనంలోనే క్లాసికల్‌ డ్యాన్సింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరిన కమల.. మనోరమ(సీనియర్‌ నటి)తో స్నేహం పెంచుకుంది. చిన్నతనంలోనే కమలకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. నటుడు నందమూరి తారక రామారావు(స్వర్గీయ)ను ఆమె ఆరాధించేది. ఆయన్ని చూసేందుకు బచ్చా గ్యాంగ్‌ను వెంటపెట్టుకుని స్టూడియోలకు సైతం వెళ్తుండేది. ఆ సమయంలో ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్‌గా చేస్తావా?’ అంటూ ముద్దాడి ఆటపట్టించేవారని జయంతి చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేవారామె.

అనుకోకుండా అదృష్టం.. 
క్లాసికల్‌ డ్యాన్సర్‌గా రాణిస్తున్న టైంలోనే కమల.. కొన్ని సినిమాల్లో బ్యాక్‌ గ్రౌండ్‌ డ్యాన్సర్‌ అవకాశాల కోసం ప్రయత్నించేది. అయితే బొద్దుగా ఉందని, డ్యాన్సులు చేయలేదేమోనన్న అనుమానంతో ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఛాలెంజింగ్‌గా తీసుకుందామె. కష్టపడి బరువు తగ్గే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉండగా కన్నడ దర్శకుడు వైఆర్‌ పుట్టస్వామి ఓ కొత్త సినిమా కోసం అడిషన్స్‌ నిర్వహిస్తున్నాడు. ఆ టైంలో డ్యాన్స్‌ రిహాల్స్‌ కోసం వెళ్లిన ఆమెను చూసి.. ఏకంగా లీడ్‌ రోల్‌ ఇచ్చేశాడాయన. అంతేకాదు కమలా కుమారి పేరును కాస్త.. ‘జయంతి’గా మార్చేశాడు. అలా ఆమె తొలిచిత్రం జెనుగూడు(1963)తో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇక ఆ సినిమా పెద్ద హిట్‌ కావడంతో.. జయంతి కాల్‌షీట్స్‌ కోసం డైరెక్టర్లు క్యూ కట్టారు.

ఇందిర ముద్దాడిన వేళ
జయంతి రెండో సినిమా ‘చందావల్లీ తోట’ సూపర్‌ హిట్‌. ఆ చిత్రానికి ప్రెసిడెంట్‌ మెడల్‌ కూడా దక్కింది. ఇక ఆమె కెరీర్‌ను తారాస్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘మిస్‌ లీలావతి’(1965). కన్నడనాట ఈ సినిమా ఓ సెన్సేషన్‌ హిట్‌.. ట్రెండ్‌ సెట్టర్‌ కూడా. కంప్లీట్‌ బోల్డ్ థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా శాండల్‌వుడ్‌కు గ్లామర్‌ సొగసులు అద్దింది జయంతి. వెస్స్ర్టన్‌ అటిరే.. టీషర్టులు, నైటీలు, అంతేకాదు కన్నడలో తొలిసారి స్విమ్‌ సూట్‌లో కనిపించిన నటిగా జయంతికి ఒక గుర్తింపు దక్కింది. నటనతోనూ దేశవ్యాప్తంగా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకుంది.

మిస్‌ లీలావతికి ఆమెకు ప్రెసిడెంట్‌ మెడల్‌ దక్కింది. ఆ సమయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ మెడల్‌ అందించింది. అంతేకాదు జయంతిని ఆప్యాయంగా ముద్దాడి.. గుడ్‌ లక్‌ కూడా చెప్పింది ఇందిర. అది తన జీవితంలో మరిచిపోలేని క్షణంగా జయంతి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకునేవాళ్లు. 

కన్నడ టు తెలుగు.. వయా తమిళ్‌
1962- 79 మధ్య సౌత్‌ సినిమాల్లో జయంతి హవా కొనసాగింది. కన్నడ, తమిళ్‌, తెలుగులో అగ్రహీరోల సరసన అవకాశాలే దక్కాయి ఆమెకు. ఆ స్టార్‌ డమ్‌తో హిందీ, మరాఠీ భాషల్లోనూ నటించింది. రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, నాలుగు కన్నడ ఉత్తమ నటి స్టేట్‌ అవార్డులు(మరో రెండు సపోర్టింగ్‌ రోల్స్‌కు కూడా) దక్కించుకుంది. జయంతి అంటే.. ‘మోస్ట్‌ బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌’ హీరోయిన్‌ అనే పబ్లిసిటీ ఆమెకు నేషనల్‌ వైడ్‌గా ఫేమ్‌ తెచ్చిపెట్టింది. అన్ని భాషల్లోనూ బ్లాక్‌ బస్టర్లు అందుకుంది. తెలుగులో ఎన్టీఆర్‌ సరసన జగదేక వీరుని కథ, కుల గౌరవం, కొండవీటి సింహాసనం, జస్టిస్‌ చౌదరిలో, కన్నడ దిగ్గజం డాక్టర్‌ రాజ్‌కుమార్‌ సరసన ఏకంగా 45 సినిమాల్లో నటించి రికార్డు నెలకొల్పింది. పుట్టన్నా కంగళ్‌, దొరై-భగవాన్‌, జెమినీ గణేశన్‌, ఎంజీఆర్‌ లాంటి వాళ్లతో నటించి ఎన్నో కల్ట్‌ క్లాసిక్స్‌ అందించారు. అటుపై 80వ దశకంలో శ్రీనివాస మూర్తి, ప్రభాకర్‌ లాంటి వాళ్ల పక్కన భార్యామణి పాత్రలు దక్కించుకున్న ఆమె.. కొన్నేళ్లు గ్యాప్‌ తీసుకుని తిరిగి సపోర్టింగ్‌ రోల్స్‌తో అలరించారు.

దర్శకుడితో వివాహం.. విడాకులు
నటుడు, తెలుగు దర్శకుడు పేకేటి శివరామ్‌ను జయంతి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇద్దరూ విడిపోయారు. లీడ్‌ రోల్స్‌ అవకాశాలు తగ్గుతున్న టైంలో.. తల్లి పాత్రలకు సైతం ఆమె ముందుకు రావడం విశేషం. 2005-06లో డాక్టర్‌ రాజ్‌కుమార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకుందామె. ఎయిడ్స్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా తీసిన ఓ యానిమేటెడ్‌ ట్యూటోరియల్‌ కు ఆమె గాత్రం సైతం అందించడం విశేషం.  

కొడుకు కేకేతో జయంతి

2017లో పద్మభూషణ్‌ డాక్టర్‌ సరోజా దేవీ నేషనల్‌ అవార్డు ఆమెకు దక్కింది. 2018లో ఆమె అనారోగ్యం బారినపడగా.. చనిపోయిందంటూ పుకార్లు మీడియా హౌజ్‌ల ద్వారా వ్యాపించాయి. అయితే ఆమె బాగానే ఉందని కుటుంబం ప్రకటించింది. చివరికి అనారోగ్యంతో జులై 26, 2021న ఆమె తుదిశ్వాస విడిచినట్లు కొడుకు కుమార్‌(కేకే) ప్రకటించాడు. తెలుగు సినిమాపై నటి జయంతి ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకవైపు హీరోయిన్‌గానే కాకుండా.. కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, దొంగ మొగుడు, తల్లిదండ్రులు, స్వాతి కిరణం, ఘరానా బుల్లోడు, పెద్దరాయుడు, రాముడొచ్చాడు, కంటే కూతుర్నే కను లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆమెకు మరింత దగ్గర చేశాయి. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ‘మెచ్యూర్డ్‌’ నటిగా ఆమె నటన ఇప్పటికీ ఆడియొన్స్‌ కళ్ల ముందు మెదలాడుతూనే ఉంటుంది.

పెదరాయుడులో జయంతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు