దర్శక నిర్మాత విజయరెడ్డి ఇక లేరు

11 Oct, 2020 01:40 IST|Sakshi
విజయరెడ్డి, అమితాబ్‌తో విజయరెడ్డి

ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత బి. విజయరెడ్డి (84) శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై, కేకే నగర్‌లో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై, కన్నమ్మాపేటలోని  శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన విజయరెడ్డి 1955లో నటనపై ఆసక్తితో అప్పటి మద్రాస్‌కు చేరుకున్నారు. దర్శకుడు విఠలాచార్య దృష్టిలో పడ్డారు.

విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘మన తుంబిడ హెన్ను అరే’ చిత్రానికి సహాయ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పలు చిత్రాలకు పని చేసిన విజయరెడ్డి సినిమా రంగంలోని పలు శాఖల గురించి తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత సహాయ దర్శకుడిగా చేశారు. 1970లో ‘రంగా మహల్‌ రహస్య’ అనే కన్నడ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, విష్ణువర్థ¯Œ  వంటి ప్రముఖ నటులతో ఈయన అత్యధిక చిత్రాలను తెరకెక్కించారు.

ముఖ్యంగా రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా ‘మయురా, హుళ్లి హాళినా మేవు’ వంటి చారిత్రక కథా చిత్రాలతో పాటు ‘శ్రీనివాసకల్యాణం, భక్త ప్రహ్లాద’ వంటి పౌరాణిక చిత్రాలను తెరకెక్కించిన ఘనత విజయరెడ్డిది. ఆయన కన్నడలోనే 40 చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు. అమితాబ్‌ బచ్చన్, రాజేష్‌ ఖన్నా, అనిల్‌కపూర్, జితేంద్ర, రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరోలతో చిత్రాలను చేశారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘శ్రీమతి’. ఆ తర్వాత ‘ఏకలవ్య, మా ఇంటి వెలుగు, చలాకీ రాణి కిలాడీ రాజా, మావూరి మొనగాళ్లు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయరెడ్డికి భార్య దమయంతి, కుమారులు త్రినాథ్‌ రెడ్డి, నాగిరెడ్డి, కుమార్తెలు నాగలక్ష్మి, శ్యామల రుషి ఉన్నారు. విజయరెడ్డి మృతికి దక్షిణ భారత వాణిజ్య మండలి అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్‌ తదితర చిత్రరంగ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

మరిన్ని వార్తలు