Vani Jayaram : వాణీ జయరామ్‌ కుటుంబ నేపథ్యం ఏంటి? ఒంటరిగా ఎందుకు ఉన్నారు?

4 Feb, 2023 16:58 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కన్నుమూసిన ఘటన మరవకు ముందే ప్రముఖ గాయని వాణీ జయరామ్‌ హఠాన్మరణం ఇప్పుడు చిత్ర పరిశ్రమను షాక్‌కి గురిచేస్తుంది. ఇటీవలె ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ అవార్డు ప్రకటించగా, ఆ అవార్డు తీసుకోకముందే ఇలా మృతిచెందడం విషాదకరం. తెలుగు, తమిళం, హిందీ సహా సుమారు 14 భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడిన ఆమె తన అద్భుతమైన గాత్రంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది.

తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన వాణీ జయరామ్‌ అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో వాణీజయరాం ఐదో సంతానం. పదేళ్ల వయస్సులోనే ఆలిండియా రేడియోలో పాటలు పాడిన ఆమె 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేసింది. తాను గాయనిగా ఇంత ఎత్తు ఎదగడానికి తన భర్త జయరామ్‌ అందించిన ప్రోత్సహమే కారణమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది వాణీ జయరామ్‌.

1969లో ఆమెకు వివాహం అయినా పిల్లలు లేరు. అయితే ఆ లోటుని సంగీతమే తీర్చిందని సగర్వంగా చెబుతుండేవారామె. ఇక వాణీ జయరామ్‌ భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. తాజాగా వాణీ జయరామ్‌ అనుమానాస్పద మృతి  దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. చెన్నైలోని నుంగంబాకం ప్రాంతంలో ఇంటిరిగా ఉంటున్న వాణీ జయరామ్‌ది సహజ మరణం కాదని.. ఎవరో హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు