రెండు భాగాలుగా విజయ్‌ సేతుపతి కొత్త చిత్రం ‘విడుదలై’

2 Sep, 2022 15:25 IST|Sakshi

ప్రస్తుతం రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రాల సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి. బాహుబలి రెండు భాగాలుగా రూపొంది ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా పుష్ప తొలి భాగం సంచలన విజయం సాధింంది. దాని సీక్వెల్‌కు చిత్ర యూనిట్‌ సిద్ధం అవుతోంది. ఇక పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం కూడా రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. తాజాగా 'విడుదలై' చిత్రం కూడా ఈ లిస్టులో చేరిపోయింది. విజయశాంతి, సూరి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఆర్‌ఎస్‌ ఇన్ఫోటైన్‌మెంట్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థల అధినేతలు ఎల్‌ రెడ్‌ కుమార్, ఉదయనిధి స్టాలిన్‌ భారీఎత్తున నిర్మిస్తున్నారు.

ఈ సంస్థలు ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా, కో వంటి సపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించారు. దీంతో 'విడుదలై' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రం తొలి భాగం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతుందని నిర్మాతలు తెలిపారు. కాగా రెండవ భాగం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని వెల్లడించారు. కథ డిమాండ్‌ చేయడంతో రూ.10 కోట్ల వ్యయంతో ఓ రైల్వే బ్రిడ్జ్‌ను రైలు కంపార్టుమెంట్‌ బోగి సెట్లను వేసి షూటింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు.

అదే విధంగా సిరుమలై ప్రాంతంలో ఒక గ్రామం సెట్‌ వేసి కీలక సన్నివేశాలను త్రీకరింనట్లు చెప్పారు. ప్రస్తుతం కొడైకెనాల్‌లో  విజయ్‌ సేతుపతి, సూరి, పలువురు ఫైట్‌ కళాకారులతో భారీ ఫైట్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. తమ గత చిత్రాల మాదిరిగానే విడుదలై  కూడా కచ్చితంగా విజయం సాధిస్తాయన్న నమ్మకాన్ని నిర్మాతల్లో ఒకరైన ఎల్‌రెడ్‌ కుమార్‌ వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు