Bill Cosby: జైలు నుంచి నటుడి విడుదల.. బాధితుల ఆక్రోదన

1 Jul, 2021 08:06 IST|Sakshi

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా అరవై మందికి పైగా బాధితులు ఆ సీనియర్‌ నటుడిపై లైంగిక ఆరోపణలు చేశారు. 2018లో నాటకీయ పరిణామాల మధ్య ఓ కేసులో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్లు జైల్లోనూ మగ్గాడు. చివరికి జడ్జి అనూహ్య నిర్ణయంతో ఆయనకు ఊరట లభించింది. ఉన్నపళంగా నటుడు, హాలీవుడ్‌ నటుడు బిల్‌ కాస్బీ బుధవారం జైలు నుంచి విడుదల కావడం, తీర్పుపై బాధితుల అసహనంతో  తీవ్ర చర్చకు దారితీసింది ఈ కేసు. 

హారిస్‌బర్గ్‌: హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, కమెడియన్‌ బిల్‌ కాస్బీ(83)ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం. 2018లో లైంగిక నేరారోపణల కేసులో ఆయనకు మూడు నుంచి పదేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే ఈ కేసులో శిక్ష విధించిన జడ్జి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాడని, కాస్బీకి శిక్ష విధించబోనని ఒప్పందం కుదుర్చుకుని మరీ శిక్ష విధించడం సరికాదని పెన్సిల్వేనియా ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు లిఖిత పూర్వకంగా బాధితుల తరపున ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది.

 

కాగా, ఈ కేసులో ఇంతకు ముందు జడ్జి, కాస్బీ నుంచి లైంగిక నేరారోపణలపై స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి మరీ శిక్ష విధించబోనని బెంచ్‌ సాక్షిగా ప్రకటించాడు(నేరస్థులకు ఉన్న ఐదవ సవరణ హక్కు ప్రకారం). అయినప్పటికీ పదేళ్ల గరిష్ఠ జైలుశిక్ష విధించడాన్ని ఇప్పుడు తప్పు బట్టింది న్యాయస్థానం. అంతేకాదు తాజా పరిణామాలతో ఆయనకు వ్యతిరేకంగా బాధితులు అమెరికా సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన న్యాయ పోరాటాన్ని.. అమెరికా చట్టంలోని లొసుగులు నీరుగారుస్తున్నాయని వాపోయారు. తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్తామని ప్రకటించారు.

ఆండ్రియాతో మొదలు..
టెంపుల్‌ యూనివర్సిటీ బాస్కెట్‌ బాల్‌ టీంలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన ఆండ్రియా కాన్‌స్టాండ్‌.. తనకు మత్తు మందిచ్చి మరీ కోస్బీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని 2005లో పోలీసులను ఆశ్రయించింది. ఏడాది తర్వాత మూడున్నర మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించి ఆమెతో కేసు క్లోజ్‌ కోసం డీల్‌ కుదుర్చుకున్నాడు కోస్బీ. అయితే 11 ఏళ్ల తర్వాత (12 ఏళ్లు గడిస్తే.. లైంగిక ఆరోపణలు చెల్లవు) మళ్లీ ఆమె తెర మీదకు వచ్చింది. ఈసారి మరో ఐదుగురు ఆమెతో కలిసి కేసు వేశారు. అదే టైంలో 60వ దశకం నుంచి ఆయనపై వినిపించిన ఆరోపణలనూ పరిగణనలోకి తీసుకుంది పెన్సిల్వేనియా లోకల్‌ కోర్టు. చివరికి విచారణ జరిపి 2018 సెప్టెంబర్‌లో కోస్బీకి శిక్ష విధించింది.

అమెరికన్‌ డాడ్‌
స్టాండప్‌ కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన కోస్బీ.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆడియొన్స్‌ను అలరించారు. 1984లో టెలికాస్ట్‌ అయిన ది కోస్బీ షో.. గొప్ప టీవీ షోగా గుర్తింపు దక్కించుకుంది.  ఈ షో ద్వారా ఆయనకు ‘అమెరికాస్‌ డాడ్‌’ అనే ఐడెంటిటీ దక్కింది. ఆ తర్వాత సినిమాల ద్వారా ఫేమ్‌ దక్కించుకున్నాడీయన. అయితే కెరీర్‌ తొలినాళ్ల నుంచే పలు అఘాయిత్యాలకు పాల్పడినట్లు కోస్బీ ఆరోపణలు ఉన్నాయి. ఇక సంచలనం సృష్టించిన #metoo ఆరోపణల్లో మొట్టమొదట జైలు శిక్షకు గురైంది ప్రముఖుడు కూడా ఈయనే. 

చదవండి: అత్యాచార కేసులో బాధితురాలి అరెస్ట్‌!. గుండెపగిలి..

మరిన్ని వార్తలు