నటుడిగా రానా బాగా ఎదిగాడు: వెంకటేష్‌

22 Mar, 2021 00:08 IST|Sakshi
బుర్రా సాయిమాధవ్, శేఖర్‌ కమ్ముల, రానా, వెంకటేశ్, విష్ణు విశాల్, జోయా

‘‘ప్రకృతితో మనందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనమందరం బాధ్యతగా ఉండాలి. ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ‘అరణ్య’ సినిమా చూశాను. అందరం గర్వపడేలా ఉంది’’ అన్నారు వెంకటేష్‌. రానా హీరోగా ప్రభు సాల్మన్‌  దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేష్‌ మాట్లాడుతూ– ‘‘లీడర్‌’, ‘ఘాజీ’, ‘బాహుబలి’ వంటి సినిమాల్లో డిఫరెంట్‌ రోల్స్‌ చేసిన రానా యాక్టర్‌గా నేర్చుకుంటున్నాడని అనుకున్నాను. కానీ ‘అరణ్య’ సినిమాలోని పాత్రలో తను ఒదిగిపోయిన తీరు చూస్తుంటే.. నటుడిగా బాగా ఎదిగాడనిపించింది.

ఇండియన్‌  స్క్రీన్‌ పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. జంతువుల హావభావాలను కెమెరాలో షూట్‌ చేయడం కష్టం. కానీ దర్శకుడు ప్రభు సాల్మన్‌  అండ్‌ టీమ్‌ బాగా తీశారు’’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ– ‘‘రానా ఎప్పుడూ విభిన్నమైన సినిమాలే చేస్తాడు. ఈ సినిమాలో తన యాక్టింగ్‌ సూపర్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘సాధారణంగా నువ్వు ఎవరు? అని తెలుసుకోవాలని అంటారు. కానీ ఈ సినిమా నాకు నేను ఎందుకు? అని నేర్పించింది. జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో ఈ సినిమా నాకు నేర్పించింది. ప్రభు సాల్మన్‌  బాగా డైరెక్ట్‌ చేశాడు. ‘అరణ్య’ సినిమాతో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళతారు’’ అని రానా అన్నారు.

‘‘ఈ సినిమాతో తెలుగుకి పరిచయమవుతున్నందుకు హ్యాపీ.  నేను హైదరాబాద్‌ అల్లుణ్ణి కానున్నాను. త్వరలో గుత్తా జ్వాల (బ్యాడ్మింటన్‌  ప్లేయర్‌), నేను పెళ్లి చేసుకోబోతున్నాం’’ అన్నారు విష్ణు విశాల్‌. ‘‘మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ నటీనటులకు,  సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని వీడియో సందేశం పంపారు ప్రభు.‘‘ప్రాణం, మనసుపెట్టి చేస్తే కానీ ఇలాంటి సినిమాలు రావు. రానా తన జీవితాన్ని మర్చిపోయి ఈ సినిమాలోని పాత్రలో జీవించాడు. ఇలాంటి డిఫరెంట్‌ సినిమాలు వచ్చేందుకు ‘అరణ్య’ ఓ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా. ‘‘నేను హైదరాబాదీ అమ్మాయిని. నా ఫస్ట్‌ తెలుగు మూవీ ‘అరణ్య’. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’’ అన్నారు జోయా.

మరిన్ని వార్తలు