తగ్గాలమ్మాయ్‌ అన్నారు!

27 Aug, 2020 02:40 IST|Sakshi

‘‘నేను కొబ్బరిబొండంలా గుండ్రంగా ఉండను, కొంచెం లావుగా ఉంటాను.. అంతే. అలా ఉండటంవల్ల నాకే మాత్రం ఇబ్బందిలేదు’’ అంటున్నారు విద్యా బాలన్‌. నేటి తరం కథానాయికలతో పోల్చితే విద్యాబాలన్‌ కొంచెం బొద్దుగానే ఉంటారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు నేను బొద్దుగా ఉండటం వల్ల అందరూ వచ్చి నా బుగ్గలు పట్టుకుని లాగేవారు. చాలా ముద్దుగా ఉన్నావని అనేవారు. అయితే వయసు పెరిగేకొద్దీ ‘తగ్గాలమ్మాయ్‌’ అనే మాటలు మొదలయ్యాయి.

‘నీ ముఖం చాలా అందంగా ఉంది. కానీ కొంచెం లావు తగ్గితే బావుంటుంది కదా’ అనేవారు. ‘ఏం.. మీకు బుర్ర పెరగలేదా?’ అని వాళ్లను అడగాలనిపించేది. కానీ టీనేజ్‌లోకి ఎంటర్‌ అయినప్పుడు అబ్బాయిల నుంచి కాస్త అటెన్షన్‌ కోరుకుంటాం. అది లేనప్పుడు బాధ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్‌ను, బాధను మాటల్లో చెప్పలేం. ఆ సమయంలో లావు గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. లావు తగ్గాలని చాలా పిచ్చి పనులు చేశాను. రోజుకు పది లీటర్లు నీళ్లు తాగితే సన్నబడతావని చెబితే, తాగడం మొదలుపెట్టాను. కొన్ని వారాల తర్వాత ఓ రోజు రాత్రి నాకు విపరీతంగా వాంతులు అయ్యాయి.

కంగారుపడుతూ నన్ను డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్‌ అడిగితే, పది లీటర్లు నీళ్లు తాగుతున్న విషయం చెప్పాను. ‘నిన్ను నీళ్లు తాగమని చెప్పినవాళ్లకు బుద్ధి లేదు. అలా తాగటం వల్ల ఆహారంలో ఉండే పోషకాలతో పాటు శక్తిని కోల్పోతావు. అందువల్ల అలా చేయకూడదు’ అన్నారు. ఇక సినిమాల్లోకి వచ్చాక కూడా చాలాసార్లు కావాలని బరువు తగ్గాను. కానీ, నా శరీరతత్వం వల్ల మళ్లీ బరువు పెరిగేదాన్ని. దాంతో బరువు మీద దృష్టి పెట్టడం మానేశాను. నేనెప్పుడైతే లావు తగ్గాలనుకోలేదో అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటున్నాను. మనలో చాలామంది మన శరీరాన్ని తిట్టుకుంటూ బతుకుతాం. కానీ మన శరీరమే మనకి గుర్తింపును ఇస్తుందనేది గ్రహించలేం’’ అన్నారు విద్యాబాలన్‌.

మరిన్ని వార్తలు