ఈ సినిమాలో నా కూతురు కనిపించలేదు..

9 Mar, 2021 13:26 IST|Sakshi

గత జ్ఞాపకాలు పంచుకున్న విద్యా బాలన్‌

ముంబై: ఎప్పుడూ చీరకట్టులో నిండుగా కనిపించే విద్యాబాలన్‌.. ‘డర్టీ పిక్చర్‌’ వంటి సినిమా చేస్తారని అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. విద్య సైతం ఇలాగే అనుకున్నారట. డైరెక్టర్‌ మిలన్‌ లూథ్రియా ఆ కథతో తన దగ్గరికి వచ్చినపుడు ఆశ్చర్యపోయారట. అయితే ఆర్టిస్టుగా తనపై ఉన్న తనకు ఉన్న నమ్మకంతో ఓకే చేశారట. ఆమె నమ్మకం నిజమైంది. ‘సిల్క్‌’  స్మిత పాత్రలో జీవించిన విద్య నటనా కౌశల్యానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. నిర్మాతపై కాసుల వర్షం కురిపించారు. 2011లో విడుదలైన ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసింది. అంతేగాక, విద్యకు జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా తెచ్చిపెట్టింది.

అయితే, సిల్క్‌గా విద్యను ఆడియన్స్‌ రిసీవ్‌ చేసుకున్నారు గానీ, మరి ఆమె కుటుంబ సభ్యులు ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ గురించి ఎలా స్పందిస్తారోనన్న అంశం తన మనసును మెలిపెట్టిందట. ఈ విషయాల గురించి తాజాగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడిన విద్యా బాలన్‌.. ‘‘మనం చేసే పని సరైందే అయితే కచ్చితంగా మనకు మద్దతు లభిస్తుంది. మీకొక విషయం చెబుతాను. డర్టీ పిక్చర్‌ స్క్రీనింగ్‌ జరుగుతున్నపుడు, మా అమ్మానాన్న ఎలా స్పందిస్తారోనన్న భయం వెంటాడింది. కానీ సినిమా చూసి బయటకు రాగానే నాన్న చప్పట్లు కొట్టారు.

‘‘ఈ సినిమాలో ఎక్కడా నా కూతురు కనిపించనేలేదు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మ అయితే క్లైమాక్స్‌ చూసి కంటతడి పెట్టుకుంది. తెర మీద నా పాత్ర చనిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. నిజానికి, సెక్సీగా కనిపించడానికి, అసభ్యంగా కనిపించడానికి ఒక సన్నని గీత ఉంటుంది. ఏదైమేనా ఆర్టిస్టుగా నాలోని భిన్న కోణాన్ని పరిచయం చేసేందుకు అవకాశం ఇచ్చిన డర్టీ పిక్చర్‌ టీంకు ధన్యవాదాలు’’అని విద్యా బాలన్‌ గత జ్ఞాపకాలు పంచుకున్నారు.

చదవండి: ఫోటోలకు ఫోజులు.. బ్యాలెన్స్‌ తప్పిన కృతి!

>
మరిన్ని వార్తలు