పాము పిల్ల వీడియో: నటుడిని ఏకిపారేస్తున్న నెటిజన్లు

2 Jul, 2021 19:36 IST|Sakshi

పామును చూస్తేనే భయంతో వణికిపోతారు చాలా మంది. గట్టిగా కేకలు వేస్తూ అది ఉన్న చోటు నుంచి పరుగులు తీస్తారు. కానీ.. అందరూ అలాగే ఉండరు కదా! పాములను పట్టుకోవడమే హాబీగా పెట్టుకుంటారు కొంతమంది. వాటిని అడవుల్లో వదిలిపెట్టి జీవ కారుణ్యాన్ని చాటుకుంటారు. ఇక మరో కేటగిరీ.. వీరు పాములతో విద్యలు ప్రదర్శిస్తూ, గారడీలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియోను నటుడు విద్యుత్‌ జమాల్‌ తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.

ఇందులో.. ఓ వృద్ధుడు పాము పిల్లను ముక్కు రంధ్రంలో దూర్చుకుని... నోట్లో నుంచి దానిని బయటకు తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో విద్యుత్‌ జమాల్‌పై కొంతమంది నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘‘వీగన్‌(శాకాహారి) అని చెప్పుకొనే నీ నుంచి ఇలాంటి పోస్టు ఊహించలేదు. అతడు చేసే పని చట్టవిరుద్దం. జీవి ఏదైనా హింసించడం సరికాదు. అయినా.. ఆ మనిషికి వేరే జీవనాధారమే లేదా? నిజంగా ఇది ఏమాత్రం మంచిది కాదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు