తెలుగు ప్రేక్షకుల ఆదరణ ప్రత్యేకమైంది

8 Mar, 2021 02:09 IST|Sakshi
ప్రియదర్శి, రాహుల్, రధన్, నాగ్‌ అశ్విన్, ఫరియా అబ్దుల్లా, నవీన్, విజయ్, ప్రియాంకదత్, అనుదీప్, స్వప్న దత్‌

– విజయ్‌ దేవరకొండ

‘‘తెలుగు ప్రేక్షకుల ఆదరణ ప్రత్యేకమైంది.. వారి ప్రోత్సాహంతోనే మా చిత్రాలు విజయవంతమవుతున్నాయి.. అభిమానులు మా కోసం ఎదైనా చేయడానికి ముందుకు వస్తున్నారు’’ అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. నవీన్‌ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్‌లో ఆదివారం ‘జాతిరత్నాలు’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు.

ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘ఈ రోజు నేను ఈ స్థాయిలో ఇక్కడ నిలబడ్డానంటే కారణం నాగ్‌ఆశ్విన్‌. అవకాశాలు రావడానికి సమయం రావాలి.. ఆ టైమ్‌ ఈరోజు వచ్చింది. నాడు మేము కన్న కలలు నిజమయ్యాయి. ‘జాతిరత్నాలు’ సినిమా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే విధంగా ఉంటుంది.. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ–‘‘విజయ్, నవీన్‌ ఎలాంటి పాత్రలైనా చేయగలరు.

ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు ఉంటారు. రాహుల్, ప్రియదర్శి, ఫరియా కూడా బాగా నటించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘విజయ్, నేను థియేటర్‌ వర్క్‌షాప్‌లో పదేళ్ల క్రితం కలుసుకున్నాం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయ్‌ మా సినిమా ఫంక్షన్‌కు అతిథిగా రావడం ఆనందంగా ఉంది. ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా ఈ సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్‌. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ని ప్రభాస్‌గారు విడుదల చేయడంతో మా సినిమా డార్లింగ్‌ రత్నాలు అయ్యింది. ఇప్పుడు విజయ్‌ రాకతో రౌడీ రత్నాల ఫ్యామిలీలా మారింది.

నాగ్‌ అశ్విన్, ప్రియాంక, స్వప్న నిజమైన రత్నాలు’’ అన్నారు నవీన్‌. ‘‘జాతిరత్నాలు’ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుంది’’ అన్నారు అనుదీప్‌. ‘‘మేం కూడా మీలో (ఆడియన్స్‌) నుంచి వచ్చిన వాళ్లమే. మీలో నుంచి కూడా ఇంకా వస్తారు’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు రాహుల్‌ రామకృష్ణ. ‘‘నా తొలి సినిమానే పెద్ద బ్యానర్‌లో చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు ఫరియా. ‘‘వరంగల్‌ నేల నన్ను తీర్చిదిద్దింది. హైదరాబాద్‌ వెళ్లి  పాటల రచయితగా వరంగల్‌ పేరు నిలబెడుతున్నాను’’ అన్నారు రచయిత కాసర్లశ్యామ్‌. 

మరిన్ని వార్తలు