విజయ్‌ దేవరకొండ, సమంతల ప్రేమకథ షురూ

21 Apr, 2022 11:42 IST|Sakshi

కెరీర్‌ పరంగా జెడ్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది.  ఈ చిత్రం పూర్తి కాకముందే..పూరితో కలిసి ‘జనగనమణ’ని సెట్స్‌పైకి తీసుకెళ్లిన విజయ్‌. తాజాగా మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ సినిమా చేయబోతున్నారు. ఇందులో విజయ్‌ సరసన స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా...ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని మూవీ యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్ లో మొదలవుతుంది. అక్కడ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ జరుపుకుంటుందని మేకర్స్‌ వెల్లడించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు