Leo Movie: అజిత్‌తో షూటింగ్‌ డుమ్మా కొట్టి మరీ లియో మూవీ చూసిన త్రిష.. థియేటర్‌లో విజయ్‌ అభిమాని ఎంగేజ్‌మెంట్‌

20 Oct, 2023 09:48 IST|Sakshi

హీరో విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. త్రిష కథానాయికగా నటించిన ఇందులో ప్రియా ఆనంద్‌, మడోనా సెబాస్టియన్‌, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్‌, గౌతమ్‌మీనన్‌, మిష్కిన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గురువారం(అక్టోబర్‌ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లియో సినిమా ఆడుతున్న థియేటర్ల ముంగిట్లో విజయ్‌ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ అభిమానులు పండగ చేసుకున్నారు. కేక్‌లు కట్‌ చేయడం, స్వీట్స్‌ పంచడం, బాణసంచా కాల్చడం వంటి కార్యక్రమాలతో హంగామా చేశారు.

ఒక్క కోవైలోనే లియో చిత్రం 100 థియేటర్లలో విడుదలైంది. ప్రభుత్వం వేకువజామున 4 గంటల ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోయినా అనేక ప్రాంతాల్లో 9 గంటల షోకు ఉదయం ఆరు, ఏడు గంటల సమయంలోనే అభిమానులు థియేటర్లకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన విజయ్‌ అభిమానులే కాకుండా, కేరళ రాష్ట్రానికి చెందిన అభిమానులు కూడా వచ్చి మొదటి షోను చూడడానికి ఆసక్తి చూపడం విశేషం. తమిళనాడు కేరళ సరిహద్దులో గల కుమరి జిల్లాలో అనేకమంది మలయాళ ప్రేక్షకులు లియో చూసేందుకు తరలివచ్చారు. విజయ్‌ ఫొటోతో 20 అడుగుల కేక్‌ను కట్‌ చేసి అభిమానులు అందరికీ పంచిపెట్టారు.

(చదవండి: లియో సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

అభిమాని నిశ్చితార్థం
లియో సినిమా రిలీజ్‌ రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పుదుకోటైకి చెందిన వెంకటేష్‌ అనే విజయ్‌ అభిమాని తను ప్రేమిస్తున్న మంజుల అనే ప్రేయసితో లియో సినిమా ఆడుతున్న థియేటర్‌లో నిశ్చితార్థం జరుపుకున్నాడు. అతను మాట్లాడుతూ తనకు తల్లి, తండ్రి ఎవరూ లేరని విజయ్‌నే తనకు అంతా అని పేర్కొన్నాడు. అందుకే ఈ రోజు తాను వివాహ నిశ్చితార్థం జరుపుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా క్రిష్ణగిరికి చెందిన మరో వీరాభిమాని లియో చిత్రం చూడడానికి థియేటర్‌కు వచ్చి ఎలాగైనా టికెట్‌ దక్కించుకోవాలని గోడపై నుంచి క్యూలోకి దూకడంతో కాలుకు తీవ్ర గాయమైంది. గాయంతోనే అతను థియేటర్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు.

కోయంబేడు రోహిణి థియేటర్లో పోలీసుల బందోబస్తు..
చిత్ర దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ చైన్నె క్రోంపేటలోని థియేటర్‌లో చిత్ర మొదటి షోను ప్రేక్షకుల మధ్య చూడడానికి వెళ్లారు. వారిని చూసిన విజయ్‌ అభిమానులు, ప్రేక్షకులు చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఆ తర్వాత లొకేష్‌ కనకరాజ్‌, అనిరుధ్‌ స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటర్‌కు వచ్చారు. థియేటర్లో ఉదయం 11.30 గంటలకే లియో చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు ముందుగానే ప్రకటించారు.

అయినప్పటికీ విజయ్‌ అభిమానులు అత్యధిక సంఖ్యలో ఉదయాన్నే అక్కడికి చేరుకుని హంగామా చేశారు. దీంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇకపోతే ఆ థియేటర్‌కు దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ వెళ్లేసరికే త్రిష అక్కడికి చేరుకున్నారు. విడాముయర్చి చిత్ర షూటింగ్‌ డుమ్మా కొట్టి త్రిష లియో చిత్రాన్ని చూడడానికి వెళ్లడం విశేషం. కాగా పుదుకోట్టైలో లియో చిత్రం చూసే ముందు ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తూ విజయ్‌ అభిమానులు కొంచెం సేపు మౌనం పాటించడం విశేషం.

చదవండి: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్‌ రివ్యూ

మరిన్ని వార్తలు