లియో ఎఫెక్ట్‌.. లోకేష్‌ కనగరాజ్‌పై విజయ్‌ తండ్రి పరోక్ష విమర్శలు

28 Jan, 2024 12:45 IST|Sakshi

కోలీవుడ్‌లో సీనియర్‌ దర్శకుడు, విజయ్‌ తండ్రి అయిన ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ఒక డైరెక్టర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యాలు చేశారు. విమర్శలను అంగీకరించే ధైర్యం ఈ కాలంలో దర్శకులకు లేదని  ఎస్‌ఏ చంద్రశేఖర్ అన్నారు. తన కుమారుడు హీరో విజయ్‌కు సంబంధించిన కథ వస్తే ఒక తండ్రిలా కాకుండా అభిమానిగా, ఒక దర్శకుడిగా వింటానని ఆయన చెప్పాడు.

ప్రస్తుత రోజుల్లో స్క్రీన్‌ప్లేకి ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన చెప్పాడు. స్టార్‌ హీరో దొరికితే చాలు. కథ లేకపోయినా ఫర్వాలేదనుకునే దర్శకులు ఇప్పటిరోజుల్లో ఉన్నారని చెప్పారు. దర్శకుడి ప్రతిభలో లోపాలు ఉన్నా.. హీరో ఇమేజ్‌తో సినిమా హిట్‌ అయితే అది తన గొప్పతనమే అనుకుంటున్నారు. కథతో పాటు స్క్రీన్‌ప్లే ఉంటే ఆ సినిమా మరింత హిట్‌ సాధిస్తుందని తన అభిప్రాయం అంటూ ఎస్‌ఏ చంద్రశేఖర్‌ అన్నారు.

ఒక సినిమా విషయంలో ఇటీవల ఓ దర్శకుడికి ఫోన్ చేసి అభినందించానని ఆయన ఇలా చెప్పారు.' సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు ఆ సినిమా చూశాను. వెంటనే ఆ డైరెక్టర్‌కు కాల్‌ చేశాను. ఫస్ట్ హాఫ్ బాగుందని  చెబుతున్నంత సేపు బాగానే నా మాటలు విన్నాడు. కానీ సెకండాఫ్‌లో కొంత భాగం బాగాలేదని  చెప్పాను. కథలో భాగంగా కన్న కుమారుడినే తండ్రి చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటి సన్నివేశాలు అంతగా కనెక్ట్‌ కావడం లేదని సలహా ఇచ్చాను. దీంతో వెంటనే అతను సార్‌.. భోజనం చేస్తున్నాను.. కొంత సమయం తర్వాత కాల్‌ చేస్తాను అని కాల్‌ కట్‌ చేశాడు.

కనీసం తర్వాత కూడా కాల్‌ చేయలేదు. సినిమా విడుదలయ్యాక నేను ఏదైతే అభిప్రాయపడ్డానో ప్రేక్షకల నుంచి కూడా అలాంటి రెస్పాన్సే వచ్చింది. నేను చెప్పినప్పుడే కొంత సమయం పాటు ఆలోచించి మార్పులు చేసి ఉంటే ఆ సినిమా ఇంకా మరోస్థాయికి చేరుకునేది. విమర్శలను కూడా తీసుకునేంత పరిణీతి అతనిలో లేవు.' అని ఆయన చెప్పారు.

విజయ్‌ తండ్రి చేసిన వ్యాఖ్యలు లియో డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ గురించే అని కోలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది. ఆయన చెప్పిన అంశాలన్నీ ఆ చిత్రానికి కనెక్ట్‌ అవుతుండటంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. లియోలో విజయ్‌ నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. అతని ఇమేజ్‌తోనే సినిమా భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. సుమారు రూ. 650 కోట్లతో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది, కానీ కథలో కొన్ని లోపాలు ఉన్నాయని మొదటిరోజు నుంచే ప్రచారం జరిగింది. దీంతో కొంతమేరకు కలెక్షన్స్‌ తగ్గాయని చెప్పవచ్చు.

whatsapp channel

మరిన్ని వార్తలు