విజయ్‌ ‘మాస్టర్’ సినిమా లీక్‌.. దర్శకుడి భావోద్వేగ ట్వీట్‌

12 Jan, 2021 12:22 IST|Sakshi

తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' విడుదలకు కొద్ది గంటల ముందే పైరసీ బారిన పడింది.  లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం (జనవరి 13)న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కానీ ఇంతలోనే సినిమాకు సంబందించిన కొన్ని సీన్లు లీక్‌ అయ్యాయి.  నిన్నటి నుంచి ఇవి సోషల్ మీడియాలో వైరల్ కాగా, పలువురు తమ స్టాటస్ మెసేజ్ లుగా వీటిని పెడుతుండటంతో సినిమా యూనిట్ అప్రమత్తమైంది. తమకు జరుగుతున్న నష్టంపై చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

‘దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించి, మాస్టర్ ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. మీ వద్దకు లీక్ అయిన దృశ్యాలు వస్తే వాటిని దయచేసి షేర్ చేయకండి. విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది’ అని లోకేశ్ కనకరాజ్ ట్వీట్‌ చేశారు.

 న‌గ‌రం, ఖైది చిత్రాల త‌ర్వాత లొకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మాస్ట‌ర్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. తెలుగు, తమిళంలో ఈ సినిమా జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్‌, ప్రోమోలతో భారీ హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

మరిన్ని వార్తలు