కన్నీటి పర్యంతమైన సీనియర్‌ నటుడు

14 Dec, 2020 17:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత నటుడు కన్నడ సూపర్‌ స్టార్‌ డాక్టర్ విష్ణువర్థన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలుగు నటుడు విజయ్‌ రంగరాజు క్షమాపణలు కోరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కన్నడ సూపర్‌ స్టార్‌ విష్ణువర్థన్‌ను ఎకవచనంలో సంబోధిస్తు.. అవమానకర రీతిలో పదజాలాన్ని వాడారు. దీంతో కన్నడ ప్రజలు, హీరో విష్ణువర్థన్‌ అభిమాన సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోలు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో రంగరాజు ఓ వీడియో విడుదల చేశాడు. మూడు నిమిషాల నిడివిగల ఈ వీడియోలో రంగరాజు ‘ప్రముఖ సూపర్‌ స్టార్ విష్ణువర్థన్‌పై నేను చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నా తప్పిదానికి కన్నడ ప్రజలకు, పరిశ్రమ పెద్దలు, నటీనటులకు నా క్షమాపణలు. నాకు తెలుసు నేను పెద్ద పాపం చేశాను. దానికి నేను శిక్షార్షుడిని. కరోనా అని నేను మొహనికి మాస్క్‌ పెట్టుకున్నాను. కానీ నేను చేసిన పాపానికి నా మొహం చూపించలేక మీ నుంచి చాటేసుకున్నట్టుగా నేను భావిస్తున్నాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఇక మహమ్మారి కాలంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఆ ఆవేశంలోనే తాను ఇలా మాట్లాడనని స్పష్టం చేశాడు. తన తప్పిదానికి విష్ణువర్థన్‌ అభిమానులు, ఆయన భార్య, కుటుంబ సభ్యులు క్షమించాలని కోరాడు. అంతేగాక కన్నడ సూపర్‌ స్టార్స్‌ సుదీప్‌ కిచాచా, పునీత్‌ రాజ్‌కుమార్‌లను కూడా మోకాళ్లపై నిలుచుని క్షమాపణలు ఆర్జిస్తూ కన్నీటీ పర్యంతరం అయ్యాడు. ఇక ఆయనతో పాటు తెలుగు సీనియర్‌ నటుడు‌, ‘మా’ (మూవీ ఆర్టీస్ట్స్‌ అసోషియేషన్‌) అధ్యక్షడు నరేష్‌ సైతం కన్నడ ప్రజలకు, పరిశ్రమకు క్షమాపణలు చెప్పాడు. కన్నడ స్టార్‌ హీరో అయిన విష్ణువర్థన్‌పై విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యాలు తనను బాధించాయని, తెలుగు సినీ పరిశ్రమ తరపున కన్నడ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానంటూ నరేష్‌ ట్విటర్‌లో వీడియో సందేశం ఇచ్చాడు.

‘విష్ణువర్థన్‌ను రంగరాజు ఏకవచనంలో సంభోదిస్తూ అసభ్య పదజాలం వాడటం సరికాదు. ఇందుకు కన్నడ సోదరి సోదరీమణులను మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. డాక్టర​ విష్ణువర్థన్‌ తమిళ, కన్నడ పరిశ్రమలోనే గాక తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనకు నేను కూడా పెద్ద అభిమానిని. అలాంటి ఆయనపై రంగరాజు వ్యక్తిగత అభిప్రాయయం చెప్పినా, అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పే. ఇందుకు ‘మా’ తరపున, తెలుగు సినీ పరిశ్రమ తరపున నేను క్షమాపణలు కోరుతున్నా’ అంటూ నరేష్‌ చెప్పుకొచ్చాడు.

అలాగే ఇకముందు కూడా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటున్నానని, తాను వ్యక్తిగతంగా కూడా రంగరాజుతో మాట్లాడి హెచ్చరిస్తానన్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నటుడు విజయ రంగరాజు కన్నడ సూపర్‌ స్టార్‌ డాక్టర్‌ విష్ణువర్థన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో కన్నడ పరిశ్రమ, కన్నడ ప్రజలు ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అవమానకర రీతిలో పదాలు వాడినందుకు రంగరాజుపై మండిపడుతూ క్షమాపణలు కోరాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక ఓ సూపర్‌ స్టార్‌పై విజయ రంగారాజు చేసిన వ్యాఖ్యాలు సరికావని, ఆయనన అనే ముందు ఆయనేంటో తెలుసుకోవాలన్నారు. ఇక ఆయన కన్నడ, తమిళ పరిశ్రమలో ఎలా అడుగుపెడతారో చూస్తామన్నారు. ఇక తన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కితీసుకోని విష్ణువర్థన్‌ కుటుంబ సభ్యలుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు