'ఒకప్పుడు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పని‌.. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌'

17 Jul, 2021 10:49 IST|Sakshi

విజయ్ సేతుపతి ఎమోషనల్ జర్నీ..

చెన్నై : కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే గొప్ప నటుడాయన. విలక్షణమైన నటనతో పాన్‌ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్‌గా ‘మాస్టర్‌ చెఫ్‌’ అనే కార్యక్రమం త్వరలోనే తమిళంలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్‌ ట్రైలర్‌ లాంఛ్‌ సందర్భంగా విజయ్‌సేతుపతి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను సినిమాల్లోకి రాకముందు కుటుంబ పోషణ కోసం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేసినట్లు పేర్కొన్నారు. 

'చెన్నైలో చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ పూర్తైన తర్వాత సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి అర్థరాత్రి 12:30 గంటలవరకు ఫాస్ట్​ ఫుడ్ సెంటర్‌లో పనిచేసేవాడ్ని.అక్కడే రాత్రి భోజనం కూడా తినేవాడ్ని. డబ్బులతో పాటు ఆకలి కూడా తీరుతుందనే కారణంతో అదే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లో చాలాకాలం వరకు పనిచేశాను. అలా నాకు  ప్రతి నెలా రూ.750 జీతం ఇచ్చేవాళ్లు. దీంతో పాటు ఓ మూడు నెలల వరకు టెలిఫోన్‌ బూత్‌లో కూడా పనిచేశాను' అని సేతుపతి అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక తనకు ఉల్లి సమోసా అంటే ఎంతో ఇష్టమని, కానీ ప్రస్తుతం అది ఎక్కడా దొరకడం లేదని తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్నప్పుడు తానే స్వయంగా ఉల్లిసమోసా చేసుకొని, ఒక కప్పు టీ తాగుతానని వివరించారు. 


 

మరిన్ని వార్తలు