Vijay : తండ్రితో విభేదాలపై ఆసక్తికరంగా స్పందించిన విజయ్‌

12 Apr, 2022 09:01 IST|Sakshi

సాక్షి, చెన్నై: సినిమాల్లో దళపతిగా ఉన్న తాను తలైవా (నాయకుడి)గా అవతరించడం అనేది కాలం చేతుల్లోనే ఉందని సినీ నటుడు విజయ్‌ వ్యాఖ్యానించారు. రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నానని, ఈ పయనాన్ని కాలంతో పాటుగా అభిమానులే నిర్ణయించాలని స్పష్టం చేశారు. సినీ నటుడు విజయ్‌ రాజకీయ ప్రవేశంపై చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి బీస్ట్‌ చిత్రం విడుదల వేళ విజయ్‌ తన స్వరాన్ని మార్చారు.

రాజకీయంగా చర్చకు తగ్గ వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో నెల్సన్‌ దర్శకత్వం వహించిన బీస్ట్‌ చిత్రం ఈనెల 13న తెర మీదకు రానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌లో ఆదివారం రాత్రి చిట్‌చాట్‌ కార్యక్రమం జరిగింది. బీస్ట్‌ చిత్ర దర్శకుడు నెల్సన్‌ సంధించిన ప్రశ్నలకు విజయ్‌ ఇచ్చిన సమాధానాలు రాజకీయంగానే కాకుండా, సినీ రంగంలోనూ చర్చకు దారి తీశాయి.  

తనదైన శైలిలో.. 
నెల్సన్‌ ప్రశ్నలకు తన దైన స్టైల్లో విజయ్‌ సమాధానాలు ఇచ్చారు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆలయాలు, దర్గాలు, దేవాలయాలకు వెళ్తూనే ఉంటానని విజయ్‌ వివరించారు. అలాగే తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌తో ఉన్న విభేదాలను ప్రస్తావిస్తూ, చెట్టుకు వేర్లు ఎలాగో.. ఓ తండ్రి కుటుంబానికి అలాంటి వాడు అని, దేవుడు కనిపించడు.. తండ్రి కనిపిస్తాడు అని సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక తన కుమారుడు సంజయ్‌ సినీరంగ ప్రవేశం గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. సంజయ్‌ తెర మీద కనిపిస్తాడా...? లేదా కెమెరా వెనుక  ఉంటాడా..? అనేది తెలియదని, తాను అందరిలాగే ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అయితే, అవకాశాలు వస్తున్న మాట మాత్రం వాస్తవమేనని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైకిల్‌ పయనం గురించి గుర్తు చేస్తూ, ఇది యాధృచ్ఛికంగా జరిగిందని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇటీవలి నగర పాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్‌ అభిమానుల గెలుపును గుర్తు చేస్తూ విల్సన్‌ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇందుకు విజయ్‌ సమాధానం ఇస్తూ, రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నానని వెల్లడించారు. అలాగే, దళపతిగా ఉన్న తాను నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో ఉందని, అభిమానులే నిర్ణయిస్తారని ముగించడం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు