Varasudu Movie Review: వారసుడు మూవీ రివ్యూ

14 Jan, 2023 13:21 IST|Sakshi
Rating:  

టైటిల్: వారసుడు
నటీనటులు: విజయ్‌, రష్మిక మందన్నా, శరత్‌ కుమార్, ప్రకాశ్‌రాజ్‌, ప్రభు, శ్రీకాంత్‌, జయసుధ, సుమన్, శ్యామ్, యోగిబాబు తదితరులు
నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని 
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
విడుదల తేదీ: జనవరి 14, 2023

తమిళ స్టార్ హీరో విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వారీసు. టాలీవుడ్‌లో 'వారసుడు'గా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటించింది. తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. తమిళ వర్షన్ జనవరి 11నే విడుదల కాగా.. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.   

అసలు కథేంటంటే..

శరత్‌కుమార్(రాజేంద్ర) ఓ పెద్ద బిజినెస్‌ మ్యాన్. అతని భార్య జయసుధ(సుధ). వీరికి ముగ్గురు కుమారులు. విజయ్(విజయ్), శ్రీకాంత్(జై), శ్యామ్(అజయ్). పెద్ద పెద్ద మైనింగ్ కాంట్రాక్టులు డీల్ చేస్తుంటారు. రాజేంద్రతో జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) బిజినెస్‌లో పోటీ పడుతుంటాడు. రాజేంద్రతో పాటు శ్రీకాంత్, శ్యామ్ బిజినెస్‌ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. ముగ్గురు కుమారులు కావడంతో వారసుడిని ప్రకటించి బిజినెస్‌ను ఎవరికీ అప్పగించాలనే ఆలోచిస్తూ ఉంటాడు రాజేంద్ర. కానీ విజయ్‌కు తన తండ్రి వ్యాపారంలో కొనసాగడం ఇష్టం లేదని చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోమంటాడు రాజేంద్ర. ఆ తర్వాత సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తాడు. 


 
మరోవైపు జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) రాజేంద్ర కాంట్రాక్టులు కొట్టేసేందుకు కుట్రలు చేస్తుంటాడు. కానీ అతని వల్ల కాకపోవడంతో శ్రీకాంత్(జై), శ్యామ్(అజయ్)ను పావులుగా వాడుకుని వారి కుటుంబాన్ని దెబ్బతీస్తాడు. ఊహించని సంఘటనలతో రాజేంద్ర కుటుంబం విడిపోతుంది. ఆ తర్వాత రాజేంద్రకు ఓ భయంకర నిజాన్ని డాక్టర్ ఆనంద్(ప్రభు) చెబుతాడు. అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంటి నుంచి వెళ్లగొట్టిన విజయ్ తిరిగొచ్చాడా? అసలు రాజేంద్రకు డాక్టర్ చెప్పిన భయంకర నిజం ఏంటి? ఆ తర్వాత కుటుంబం అంతా కలిసిందా? జై, అజయ్ మళ్లీ కుటుంబంతో కలిశారా? రాజేంద్ర తన వారసుడిగా ముగ్గురిలో ఎవరినీ ప్రకటించారు? రాజేంద్ర బిజినెస్‌ను అలాగే కొనసాగించారా?  చివరికి కుటుంబం, బిజినెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే అసలు కథ.


  

కథ ఎలా ఉందంటే..

కథ విషయానికొస్తే.. రోటీన్ స్టోరీ అయినప్పటికీ తెరపై రిచ్‌ లుక్ కనిపించేలా చేశారు. ప్రకాశ్ రాజ్ ఎంట్రీతో కథ మొదలు కావడం, బిజినెస్ డీల్స్, కాంట్రాక్టులు అంతా రోటీన్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ తప్ప.. రొమాంటిక్ సీన్స్ పెద్దగా కనిపించవు. విజయ్, కిచ్చా మామ(యోగిబాబు) మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు తెప్పించడం ఖాయం. ఫస్టాప్‌లో కుటుంబంలో గొడవలు, బిజినెస్ కాంట్రాక్టలతో కథనం సాగుతుంది. కథలో జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకులు ఊహకు అందేలా ఉన్నాయి. అయితే సీరియస్ సీన్లలోనూ కామెడీ పండించడం వంశీ తనదైన మార్క్ చూపారు. కథలో కొత్తదనం లేకపోవడం వల్ల ప్రేక్షకులకు అంతగా ఆసక్తి కలగకపోవచ్చు. కథ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ప్రేమ, అప్యాయతలను కొత్త కోణంలో చూపించారు డైరెక్టర్ వంశీ.


సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఒకవైపు బిజినెస్ కాపాడుకోవడం, అలాగే కుటుంబాన్ని ఒక్కటి చేయడం ఈ రెండు అంశాల ఆధారంగా కథను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు విజయ్‌ యాక్షన్ ప్రేక్షకులకు అలరిస్తాయి. హీరోయిన్ రష్మిక పాత్రను కొంతమేరకే పరిమితం చేశారు. కుటుంబ సభ్యుల మధ్యే పోటీ, బిజినెస్‌లో పెత్తనం కోసం వారి మధ్య జరిగే పోరాటం చుట్టే స్టోరీ నడుస్తుంది. విజయ్ ఫైట్స్, పాటలు అభిమానులను అలరించడంలో సందేహం లేదు. సెకండాఫ్‌లో రంజితమే సాంగ్ గ్రాండ్‌గా తెరకెక్కించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఫ్యామిలీ ఎమోషన్స్, బిజినెస్ చుట్టే కథను నడిపించడం రోటీన్‌గా అనిపిస్తుంది. ఇలాంటి కథలు గతంలోనూ వచ్చినప్పటికీ కాస్త భిన్నంగా చూపించారు. కొన్ని చోట్ల ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కంటతడి పెట్టించారు. ఓవరాల్‌గా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను తెరపై సరికొత్తగా ఆవిష్కరించారు వంశీ. 

ఎవరెలా చేశారంటే..

విజయ్ తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. సీరియస్ సీన్లలో కామెడీ పండించడం, ఫైట్ సీన్స్‌, డ్యాన్స్‌తో విజయ్ అదరగొట్టారు. ముఖ్యంగా ఫైట్ సీన్స్‌లో తనదైన మార్క్ చూపించారు. రష్మిక పాత్ర చిన్నదే అయినప్పటికీ తన గ్లామర్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిజినెస్‌ మ్యాన్‌గా  శరత్ కుమార్, అమ్మ పాత్రలో జయసుధ ఒదిగిపోయారు. శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, ప్రభు, యోగిబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  తమన్ సంగీతం సినిమాకు అదనపు బలం.  కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగుంది. ప్రవీణ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. 

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు