వీరప్పన్‌ డెన్‌లో నిధి ఉంది: కుమార్తె విజయలక్ష్మి

11 Apr, 2021 07:15 IST|Sakshi

సాక్షి, చెన్నై: చందనపు దొంగ వీరప్పన్‌ రాజ్యమేలిన సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్‌ ఉన్నట్టు ఆయన కుమార్తె విజయలక్ష్మి పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన చందనపు దొంగ వీరప్పన్‌ ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం అడవుల్ని స్థావరంగా చేసుకుని చందనపు దుంగలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్‌లో రాజ్యమేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరప్పన్‌ లేడు. 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసు చేతిలో హతమయ్యాడు. వీరప్పన్‌ స్మగ్లింగ్‌ సామ్రాజ్యం అంతమైనా, తరచూ వీరప్పన్‌ పేరు మాత్రం వార్తల్లోనే ఉంటూ వస్తున్నది.

ఇందుకు కారణం ఆయన కుటుంబమే. వీరప్పన్‌కు సతీమణి ముత్తులక్ష్మి, విద్యారాణి, విజయలక్ష్మి కుమార్తెలు ఉన్నారు. విద్యారాణి బీజేపీలో చేరి మహిళా యువజన నేతగా ఉన్నారు. ఇక, విజయలక్ష్మి తమిళర్‌ వాల్మురిమై కట్చిలో ఉన్నారు. ఈనెలాఖరులో తెరకెక్కనున్న మావీ రన్‌ పిళ్లై చిత్రంలో నటించారు. ఈ చిత్రం చందనపు దొంగ జీవిత ఇతివృత్తంతో చిత్రికరించినట్టు తెలిసింది. అందుకు తగ్గట్టుగానే పోస్టర్లు, టీజర్లు ఉండడం చర్చకు దారి తీశాయి. అయితే, దీనిని విజయలక్ష్మి ఖండించారు.

పెద్ద డంప్‌.. 
చెన్నైలో చిత్ర యూనిట్‌ కలిసి జరిగిన సమావేశంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో ఈ చిత్రానికి తన తండ్రి జీవితానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం మహిళలపై జరుగుతున్న దాడులు, మహిళాసాధికారితకు సంబంధించిన చిత్రంగా వివరించారు. తనకు తండ్రి వీరప్పన్‌ అంటే ఎంతో ఇష్టమని, ఆయన సత్యమంగళం అడవుల్లోనే అత్యధిక కాలం జీవించారని పేర్కొన్నారు. ఈ అడవుల్లో తన తండ్రి దాచిపెట్టిన అతి పెద్ద నిధి ఉందని, దీనిని కనిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, ఈ నిధి గురించి తెలిసిన తన తండ్రి, ఆయన అనుచరుడు ఈ లోకంలో లేరని, ఈ దృష్ట్యా, ఆ నిధి ఎక్కడుందో  ప్రశ్నార్థకమేనని ముగించడం గమనార్హం.
చదవండి: అమిత్‌ షా రాజీనామా చేయాలి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు