Vijayanand Biopic: విజయానంద్‌ బయోపిక్‌.. నేటి తరానికి స్ఫూర్తి..

12 Dec, 2022 09:46 IST|Sakshi

కొన్ని చిత్రాలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్ని చిత్రాలు సమాజానికి ప్రేరణగా నిలుస్తాయి. సూరరై పోట్రు వంటి చిత్రాలు రెండో కోవకు చెందినవే. తాజాగా విడుదలైన విజయానంద్‌ చిత్రం అలాంటిదే. జీవితం సంతోషంగా సాగిపోతోంది, అక్కడితో ఆగిపోకూడదు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కనాలి. అందుకు శక్తి వంచన లేకుండా శ్రమించాలి. ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అనుకున్నది సాధించాలి. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రమే విజయానంద్‌.

ఈ కథ కల్పన కాదు.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి స్వయం కృషితో అత్యున్నత స్థాయికి ఎదిగిన  వ్యక్తి నిజ జీవితం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త విజయ్‌ సంగేశ్వర్‌ బయోపిక్‌. అందుకే ఆ చిత్రాన్ని నేటి యువతకు ప్రేరణగా పేర్కొనవచ్చు. విజయ్‌ సంగేశ్వర్‌ తండ్రి మ్యాన్యువల్‌ ప్రింటింగ్‌ మిషన్‌ పెట్టుకుని కుటుంబాన్ని పోషించారు. ఆయనకు చేదోడుగా ఉండే ఆయన కొడుకు డ్రీమ్‌ పెద్దదిగా ఉంటుంది. దీంతో ఆప్‌ సెట్‌ ప్రింటింగ్‌ మిషన్‌ కొనుగోలు చేస్తాడు. ఆ వృత్తి సాఫీగా సాగుతున్నా, కొత్త వ్యాపారం చేయాలని భావిస్తాడు. ఒక లారీని కొనాలన్న అతని నిర్ణయానికి తండ్రి అడ్డుపడ్డారు.

దీంతో ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చేసి తన కలను సాకారం చేసుకోవడానికి లారీని కోనుగోలు చేస్తాడు. అలా తన స్వయం కృషితో 120 లారీలకు అధిపతి అవుతాడు. అంతటితో ఆగకుండా పత్రిక అధిపతి కూడా అవుతాడు. అందుకు అతను ఎంతగా శ్రమించాడు, ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం విజయానంద్‌. వీఆర్‌ఎల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై డా.ఆనంద్‌ సంగేశ్వర్‌ నిర్మించిన ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు రిషిక శర్మ దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది.  

మరిన్ని వార్తలు