Vijayashanthi: రానా నాయుడుపై విజయశాంతి ఫైర్‌! ఓటీటీకి సెన్సార్‌ ఉండాలి..

19 Mar, 2023 08:59 IST|Sakshi

థియేటర్లో రిలీజయ్యే సినిమాలకు సెన్సార్‌ తప్పనిసరి. అసభ్యత, హింస మితిమీరకుండా సెన్సార్‌ అడ్డుకుంటుంది. కానీ ఓటీటీకి ఎలాంటి పరిమితులు లేవు. ఎటువంటి కంటెంట్‌ అయినా వాడేస్తోంది. అందులో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లకు షరతులు విధించే సెన్సార్‌ లేకపోవడంతో అసభ్యమైన సన్నివేశాలు, డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, బూతులు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇటీవల వెంకటేశ్‌, రానా సైతం ఇలాంటి కంటెంట్‌కే ఓటేస్తూ రానా నాయుడు సిరీస్‌ చేసిన విషయం తెలిసిందే! ఈ సిరీస్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటి విజయశాంతి 'ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ఓటీటీ సిరీస్ గురించి..' అంటూ రానా నాయుడు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

'ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా కఠినమైన సెన్సార్‌ విధానం ఉండి తీరాలి. తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోకుండా ఉంటారని భావిస్తున్నా. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సిరీస్‌ను నటులు, నిర్మాతలు వెంటనే ఓటీటీ నుంచి తొలగించాలని కోరుతున్నా. భవిష్యత్తులో కూడా ఓటీటీ ప్రసారాలలో ప్రజల నుంచి ప్రత్యేకంగా మహిళల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నా. ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా' అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది విజయశాంతి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ 'మీరు చెప్పింది అక్షరాలా నిజం మేడమ్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు