రాజమౌళి అంత సక్సెస్‌ విశాల్‌ అందుకోవాలి

15 Nov, 2022 04:08 IST|Sakshi
యువన్‌శంకర్, వినోద్‌కుమార్, విజయేంద్ర ప్రసాద్, విశాల్, సునయన

– విజయేంద్ర ప్రసాద్‌

‘‘సినిమా కథకి ఎంత బడ్జెట్‌ అయినా, షూటింగ్‌కి ఎన్ని రోజులు పట్టినా చేయాలనే జబ్బు విశాల్‌కి ఉంది. ఆ జబ్బు మా అబ్బాయి రాజమౌళి నుంచి విశాల్‌కి అంటుకుంది (నవ్వుతూ). రాజమౌళి ఎంత సక్సెస్‌ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్‌ కూడా అంతే సక్సెస్‌ అందుకోవాలి’’ అని ప్రముఖ రచయిత–దర్శకుడు, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. విశాల్, సునయన జంటగా ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాఠీ’. రానా ప్రొడక్షన్స్ పై రమణ, నంద నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్‌ 22న విడుదల కానుంది.

ఈ చిత్రం టీజర్‌ని విజయేంద్ర ప్రసాద్‌ రిలీజ్‌ చేశారు. విశాల్‌ మాట్లాడుతూ– ‘‘వినోద్‌ కుమార్‌ గురించి ‘లాఠీ’ విడుదలయ్యాక సిల్వర్‌ స్క్రీనే చెబుతుంది. రమణ, నంద చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. నా ప్రతి సినిమాలానే ‘లాఠీ’ని ఎంత మంది చూస్తారో టికెట్‌కి రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను’’ అన్నారు. ‘‘లాఠీ’ యాక్షన్‌ అడ్వంచర్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌ మూవీ’’ అన్నారు వినోద్‌ కుమార్‌. ‘‘ఈ సినిమాతో విశాల్‌కి జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రమణ. మాటల రచయిత రాజేష్‌ ఎ.మూర్తి, పాటల రచయిత చంద్రబోస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు