మరో బాలీవుడ్‌ చిత్రానికి బాహుబలి‌ రచయిత స్క్రిప్ట్‌

27 Feb, 2021 14:13 IST|Sakshi

‘భజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’ వంటి బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌ మరోసారి బాలీవుడ్‌లో ఒక బహుభాషా చిత్రానికి స్క్రిప్ట్‌ సమకూర్చుతున్నారు. ‘సీత... ది ఇన్‌కార్నేషన్‌’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి అలౌకిక్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించనున్నారు. హ్యూమన్‌ బీయింగ్‌ స్డూడియోస్‌ సంస్థ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. తాజాగా విడుదలైన ‘సీత... ది ఇన్‌కార్నేషన్‌’ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీతాదేవి గురించి ఎవరికీ తెలియని విషయాల్ని ఈ సినిమాలో చూపించనున్నారు. మనోజ్‌ ముంతాషీర్‌ మాటలు రాస్తున్న ఈ చిత్రాన్ని ప్యాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు.

హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి పెద్ద ఎత్తున వీఎఫ్‌ఎక్స్‌ చేయనున్నారట. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఇంకా ప్రకటించలేదు. అందుకే సీత పాత్రలో ఎవరు నటించనున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే విజయేంద్రప్రసాద్‌ కథ అందించిన తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీ అక్టోబర్‌ 13న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు