Vikram Telugu Movie Review: ‘విక్రమ్‌’ మూవీ రివ్యూ

3 Jun, 2022 13:13 IST|Sakshi
Rating:  

టైటిల్‌: విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌
నటీనటులు: కమల్‌ హాసన్, విజయ్‌ సేతుపతి, ఫాహద్ ఫాజిల్‌, సూర్య, అర్జున్ దాస్‌, శివానీ నారాయణన్‌ తదితరులు
దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌
సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌
నిర్మాణ సంస్థ : రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌
విడుదల తేది: జూన్‌ 3, 2022

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ వెండితెరపై సందడి చేసి సుమారు నాలుగేళ్లయింది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జూన్‌ 3న 'విక్రమ్‌'గా సందడి చేసేందుకు వచ్చేశారు కమల్ హాసన్. లోకేశ్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇందులో సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌' పేరుతో సుధాకర్‌ రెడ్డి, హీరో నితిన్‌ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పోస్టర్స్‌, టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో అనిరుధ్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. మరి ఇన్ని అంచనాల మధ్య శుక్రవారం(జూన్‌ 3) విడుదలైన 'విక్రమ్‌'ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

విక్రమ్‌ కథేంటంటే...
మాస్క్‌ మ్యాన్‌ పేరుతో ఓ ముఠా వరుస హత్యలకు పాల్పడుతుంది. అందులో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్న పోలీసు అధికారి ప్రభంజన్‌, అతని తండ్రి కర్ణణ్‌ (కమల్‌ హాసన్‌) కూడా ఉంటారు. ఈ ముఠాను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు స్పై ఏజెంట్‌ అమర్‌(ఫాహద్‌ ఫాజిల్‌). అతని టీమ్‌తో కలిసి ఈ కేసును ఛేదించే క్రమంలో ప్రభంజన్‌ హత్య వెనుక డ్రగ్స్‌ మాఫియా లీడర్‌ సంతానం(విజయ్‌ సేతుపతి)ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అందరూ అనుకున్నట్లుగా కర్ణణ్‌ చనిపోలేదనే విషయం కూడా తెలుస్తుంది. మరి కర్ణణ్‌ చనిపోయినట్లు ఎందుకు నటించాడు? అతని నేపథ్యం ఏంటి? అతనికి ఏజెంట్‌ విక్రమ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? డ్రగ్స్‌ మాఫియాను అరికట్టేందుకు కర్ణణ్‌ వేసిన ప్లాన్‌ ఏంటి? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? చివరకు అమర్‌ వారికి ఏవిధంగా సహాయం చేశాడు? ఈ కథలోకి సూర్య ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అనేది తెలియాలంటే విక్రమ్‌ సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
స్టైలిష్‌ యాక్షన్‌కి పెట్టింది పేరు లోకేష్‌ కనకరాజన్‌. అలాంటి దర్శకుడికి కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ లాంటి దిగ్గజ నటులు దొరికితే.. ఎలా ఉంటుంది? యాక్షన్‌ సీన్స్‌ని వేరే లెవల్‌లో చూపించొచ్చు. విక్రమ్‌లో కనకరాజన్‌ అదే చేశాడు. ఫుల్‌ యాక్షన్స్‌ సీన్స్‌తో దుమ్ము దులిపేశాడు. కథలో కావాల్సినన్ని ట్విస్టులు, ఎలివేషన్స్‌ ఉన్నాయి. డ్రగ్స్‌ మాఫియా చుట్టూ విక్రమ్‌ కథ తిరుగుతుంది. భారీ స్థాయిలో డ్రగ్స్‌ని పట్టుకోవడం, దాని ఆచూకీ కోసం సంతానం ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో వరుస హత్యలు.. స్పై ఏజెంట్ అమర్‌ రంగంలోకి దిగడం.. కర్ణణ్‌ గురించి కొన్ని నిజాలు తెలియడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్‌లో సాదా సీదాగా అనిపించిన సీన్లను సెకండాఫ్‌కు ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.

ఇక సెకండాఫ్‌లో అయితే యాక్షన్‌ డోస్‌ భారీగా పెంచేశాడు. 1987 నాటి  ‘విక్రమ్’ సినిమాకు, అలాగే లోకేష్‌ కనకరాజన్‌ గత చిత్రాలు ‘ఖైదీ’, ‘మాస్టర్‌’కి ఈ చిత్రాన్ని లింక్‌ చేసిన విధానం బాగుంది. ఇక క్లైమాక్స్‌లో అయితే కమల్‌ హాసన్‌ చేసే యాక్షన్‌ సీన్స్‌..  రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ అదిరిపోతుంది. అంతేకాదు పార్ట్‌ 2 ఉంటుందని సూర్య పాత్రతో చెప్పించాడు దర్శకుడు. ఎప్పుడెప్పుడు కమల్, సూర్యలను తెరపై పూర్తి స్థాయిలో చూస్తామా అని వెయిట్ చేసేలా చేశాడు. 

ఎవరెలా చేశారంటే..
విక్రమ్‌ పాత్రలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ ఒదిగిపోయాడు. 67 ఏళ్ల వయసులోనూ ఇలాంటి పాత్రలో నటించడం ఒక్క కమల్‌కే సాధ్యమయింది. యాక్షన్‌ సీన్స్‌లో కమల్‌ చూపించే యాటిట్యూడ్‌ అదిరిపోయింది. అలాగే ఫస్టాఫ్‌లో తాగుబోతుగా, డ్రగ్స్‌ బానిసగా తనదైన నటనతో ఆదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో కమల్‌ చేసే ఫైట్స్‌ సీన్‌ సినిమాకే హైలైట్‌. ఇక స్పై ఏజెంట్‌ అమర్‌గా ఫహద్‌ ఫాజిల్‌ మంచి నటనను కనబరిచాడు. యాక్షన్‌ సీన్స్‌లో దుమ్ము దులిపేశాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు.

ఇక విజయ్‌ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలోనైనా అవలీలగా నటిస్తాడు. డ్రగ్స్‌ మాఫీయా లీడర్‌ సంతానం పాత్రలో విజయ్‌ సేతుపతి పరకాయ ప్రవేశం చేశాడు. అతని గెటప్‌ కానీ, యాక్టింగ్‌ కానీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా సూర్య ఎంట్రీ అదిరిపోతుంది. తెరపై ఉన్నది కొద్ది క్షణాలే అయినా.. తనదైన నటనతో అందరినీ మెప్పించాడు. అంతేకాదు పార్ట్‌2పై  ఆసక్తిని కూడా పెంచేశాడు. సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం అనిరుధ్‌ సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. గిరీష్‌ గంగాధరణ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ప్లే చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

Rating:  
(3/5)
మరిన్ని వార్తలు