Vikrant Rona Movie Review: విక్రాంత్‌ రోణ సినిమా రివ్యూ

28 Jul, 2022 16:47 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : విక్రాంత్‌ రోణ
నటీనటులు :కిచ్చా సుదీప్‌, నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, మధుసూదన్‌ రావు తదితరులు
నిర్మాత: జాక్‌ మంజునాథ్‌, అలంకార్‌ పాండియన్‌
దర్శకత్వం: అనూప్‌ భండారి
సంగీతం : అజనీష్‌ లోకనాథ్‌
సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్‌
విడుదల తేది: జులై 28, 2022

కథేంటంటే..
కొమరట్టు గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ఊర్లో ఓ పాడుబడ్డ ఇంట్లోని బావిలో శవాలు కనిపిస్తుంటాయి. బ్రహ్మరాక్షసుడే వీరందరినీ చంపుతున్నాడని గ్రామస్తుల నమ్మకం. ఊరిపెద్ద జనార్థన్‌ గంభీర్‌(మధుసూదన్‌రావు), అతని తమ్ముడు ఏక్‌నాథ్‌ గంభీర్‌(రమేశ్‌ రాయ్‌)కూడా గ్రామ ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పి ఆ ఇంటివైపు ఎవరినీ వెళ్లకుండా చేస్తారు. అయితే ఓ సారి ఆ ఊరి ఎస్సై ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్లగా.. తెల్లారి బావిలో శవమై కనిపిస్తాడు. అతని మొండెం మాత్రమే లభిస్తుంది కానీ తల కనిపించదు. ఈ హత్య కేసును చేధించడానికి ఆ ఊరికి కొత్త ఎస్సై వస్తాడు. అతనే విక్రాంత్‌ రోణ(కిచ్చా సుధీప్‌).

ఈ కేసు విచారణలో అతనికి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ గ్రామానికి చెందిన స్కూల్‌ పిల్లలు పదుల సంఖ్యలో హత్యకు గురయ్యారని తెలుస్తుంది. మరి పిల్లల హత్యకు కారకులు ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఆ ఊరికి కొత్తగా వచ్చిన సంజు(నిరూప్‌ భండారి)ఎవరు? గ్రామస్తులను భయపెడుతున్న బ్రహ్మరాక్షసుడు ఎవరు? ఎస్సై హత్య కేసుతో విక్రాంత్‌ వ్యక్తిగత జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే విక్రాంత్‌ రోణ సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
విక్రాంత్‌ రోణ..ఇదొక యాక్షన్‌ ఎమోషనల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ కథా చిత్రమని తొలి నుంచి చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చింది. ట్రైలర్‌, టీజర్‌లో కూడా ఆ విధంగానే చూపించింది. పైగా పాన్‌ ఇండియా మూవీ అనగానే.. కేజీయఫ్‌ తర్వాత కన్నడ నుంచి మరో భారీ మూవీ రాబోతుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది కూడా కేజీయఫ్‌ రేంజ్‌లో ఉంటుందని ఊహించారు. కానీ దర్శకుడు అనూప్‌ భండారి నిరాశపరిచాడు. తెరపై విజువల్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ అద్భుతంగా ఉన్నప్పటికీ.. కథలో పసలేదు. అసలు దర్శకుడు ఏ జానర్‌లో ఈ కథను తెరకెక్కించాలనుకున్నాడో సరైన క్లారిటీ లేదనిపిస్తుంది. ఓ తల్లీకూతుళ్లు అర్ధరాత్రి కొమరట్టుకు బయలుదేరగా.. ముసుగులో ఉన్న కొంతమంది వారిని హత్య చేయడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో ఏదో జరుగుతుంది. ఆ పాడుబడ్డ ఇంట్లో ఎవరు ఉన్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఎస్సై విక్రాంత్‌ రోణ ఎంట్రీతో కథలో స్పీడ్‌ పెరుగుతుంది.  యాక్షన్‌ ఎపిసోడ్‌ బాగున్నప్పటికీ.. వరుస హత్యల రహస్యాన్ని చేధించే సీన్స్‌ ఆసక్తికరంగా సాగవు. దానికి తోడు సంజు లవ్‌ట్రాక్‌, మదర్‌ సెంటిమెంట్‌ అంతగా ఆకట్టుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌. మధ్య మధ్య వచ్చే కొన్ని భయంకర సన్నివేశాలు మినహా.. కథ ఎక్కడా ఆకట్టుకునే విధంగా ఉండదు.

ఎవరెలా చేశారంటే..
విక్రాంత్‌ రోణ పాత్రలో సుదీప్‌ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టేశాడు. సంజుగా నిరూప్‌ బండారి పర్వాలేదు. క్లైమాక్స్‌లో అతని పాత్ర సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అపర్ణగా నీతా అశోక్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఫక్రూగా కార్తీక్‌ రావు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక రక్కమ్మగా జాక్వెలిన్‌ తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటుల పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అజనీష్‌ నేపథ్య సంగీతం చాలా బాగుంది. రారా రక్కమ్మ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. శివ కుమార్‌ ఆర్ట్‌వర్క్‌ అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. విలినియం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

Rating:  
(2.25/5)
మరిన్ని వార్తలు