ఆ విషయంలో వెన్నెల.. నేనూ ఒకటే! 

15 Jun, 2022 00:48 IST|Sakshi

‘‘ఒక నటిగా విభిన్న పాత్రలు చేయాలనుకుంటాను. ఒకే క్వొశ్చన్‌ పేపర్‌కు మళ్లీ మళ్లీ అదే సమాధానాలు రాయడంలో మజా ఉండదు. ప్రతి సినిమాకు కాస్త ప్రెజర్, పెయిన్‌ ఉండటమే బెటర్‌ అని నా ఫీలింగ్‌. లేకపోతే బోర్‌ కొడుతుంది’’ అన్నారు సాయిపల్లవి. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల17న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సాయిపల్లవి పంచుకున్న విశేషాలు. 

నేను తమిళనాడులో పుట్టాను. తెలంగాణాలోని పరిస్థితులపై నాకంత అవగాహన లేదు. అందుకే ‘విరాటపర్వం’ కొత్తగా అనిపించింది. అప్పటి నక్సలిజం పరిస్థితుల్లో ఏది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. మా తాతగారు మాజీ పోలీసాఫీసర్‌. నక్సలిజం గురించి ఆయన నాకు ఏదైనా చెప్పడానికి ఆయనకు ‘విరాటపర్వం’ గురించి తెలియదు. ఇక వెన్నెల (‘విరాటపర్వం’లో సాయిపల్లవి పాత్ర)ను ఓ పాత్రగానే చేశాను.

ఈ పాత్ర నాకో లెర్నింగ్‌ ప్రాసెస్‌. వెన్నెల ఒక సాధారణ అమ్మాయి. అమాయకత్వంతో కూడిన వ్యక్తిత్వం తనది. అలాగే తను నమ్మేదాన్ని సాధించే తెగువ కూడా ఉంది. వెన్నెల, సాయిపల్లవి (తనని తాను ఉద్దేశించి) ప్రేమను చూసే విధానం ఒకేలా ఉంటుంది. అయితే తన ప్రేమ కోసం వెన్నెల ఎంతైనా ఎఫర్ట్స్‌ పెడితే.. పల్లవి మాత్రం అంత ప్రయత్నించదేమో! సరళగారి (వెన్నెలకు స్ఫూర్తి) కుటుంబాన్ని కలిశాను. ఎమోషనల్‌గా అనిపించింది.   

ప్రాజెక్ట్‌ స్కేల్‌ మారింది
నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్‌గార్లతో పాటు వేణు ఊడుగుల ముందుగా ‘విరాటపర్వం’ గురించి నాతో మాట్లాడారు. ఆ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్‌ సురేష్‌బాబుగారి దగ్గరికి వెళ్లింది. అలా రానాగారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. రానాగారు స్టార్‌డమ్‌ ఉన్న హీరో. రవన్న పాత్రకు రానాగారి వాయిస్, హైట్‌ బాగా నప్పాయి. ఒక స్క్రిప్ట్‌ను ఒప్పుకున్నప్పుడు పేపర్‌ మీద ఉన్నదానికంటే  ఎక్కువే చేయొచ్చని రానాగారి నుంచి నేర్చుకున్నాను.

చెప్పా లంటే రానాగారు వచ్చాక ‘విరాటపర్వం’ ప్రాజెక్ట్‌ స్కేలే మారిపోయింది. దర్శకుడు వేణుగారు అద్భుతమైన రచయిత. తనకు తెలిసినదాని గురించి తనకంటే ఎవరూ బాగా చెప్పలేరని నమ్మే వ్యక్తి ఆయన. అలాగే అంతే స్థాయిలో రీసెర్చ్‌ కూడా చేస్తారు. 

రాసి పెట్టి ఉంటే వస్తుంది
సినిమా సినిమాకు మధ్య ఉండే గ్యాప్‌ గురించి నేను ఆలోచించను. నాకు ఆర్ట్‌ (కళ)పై పూర్తి నమ్మకం ఉంది. ఏదైనా కథ మనకు రాసి పెట్టి ఉంటే అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని నా నమ్మకం. ఇక నా కోసమే కొందరు దర్శకులు కొన్ని పాత్రలను సృష్టిస్తున్నారంటే అది నాకు సంతోషాన్నిచ్చే అంశమే. కథలను ఎంపిక చేసుకోవడంలో నా ఇమేజ్‌ను నేను ఇబ్బందిగా ఫీల్‌ కావడంలేదు. ఒత్తిడి కూడా లేదు. మనం ఉన్నా లేకున్నా సినిమాలు శాశ్వతంగా ఉంటాయి. నేను వెళ్లిపోయిన తర్వాత కూడా నేను యాక్ట్‌ చేసిన ఓ సినిమాను చూసి ప్రేక్షకులు మెచ్చుకోవాలనే ఆలోచనతోనే సినిమా అంగీకరిస్తాను. 

గత జన్మలో ఇక్కడే పుట్టానేమో! 
‘ఫిదా’, ‘లవ్‌స్టోరీ’, ఇప్పుడు ‘విరాటపర్వం’.. ఇలా వరుసగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు చేశాను. మా ఇంట్లో కూడా నేను మారిపోయానని అంటున్నారు. బహుశా.. నేను గత జన్మలో ఇక్కడే పుట్టానేమో!’ అని చెప్పిన సాయిపల్లవితో ‘మీ జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారు?’ అనడిగితే... ఇంకా పుట్టలేదని అనుకుంటున్నాను’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.   

మరిన్ని వార్తలు