Ghantasala: 'ఆయనకు భారతరత్న వస్తే అవార్డుకే  అందం'

20 Sep, 2022 20:17 IST|Sakshi

స్వాతంత్ర సమరయోధుడు, పద్మశ్రీ  ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారతరత్న వచ్చేందుకు మనమంతా కృషి చేయాలని ప్రముఖ టాలీవుడ్ దర్శకులు ఆదిత్య, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్రం అవార్డు ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నీలిమ గడ్డమణగు వ్యాఖ్యాతగా సెప్టెంబర్‌ 18న వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  ఈ అంశంపై అమెరికాలోని శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ' మీరందరు విదేశాల్లో ఉండి కూడా ఘంటసాలకి భారతరత్న రావాలన్న మీ ప్రయత్నాలకు మా అందరి తరఫున అభినందనలు. ముఖ్యంగా ఘంటసాల కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం, అందరినీ కలుపుకొని పోవడం అభినందనీయం. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మనం  చేస్తున్నాం. ఎందుకంటే ఘంటసాల జాతీయ సంపద.. స్వాతంత్ర సమరయోధుడు. వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వేల పాటలు పాడటం ఇలా అన్ని విధాలుగా వారు భారతరత్నకు అర్హులు' అని అన్నారు.  

దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమం గురించి ఈ మధ్యనే విన్నా. ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకే  అందం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు అందిస్తే మా నాన్న నాకు ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని అందించారు. అదే మా నాన్న నాకిచ్చిన వారసత్వం. ఆయన పాటలు, సాహిత్యాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తానని' తెలిపారు. 

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ 'ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. ఇది చాలా  గొప్ప కార్యక్రమం. మా ముందు తరాల వారికీ ఆయన ఒక దేవుడు. సంగీతం లో గాన గంధర్వుడు. మంచి గాయకుడే  కాకుండా 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాకు ఘంటసాల పాటలు అంటే చాలా ఇష్టం. ఆయన సంగీత దర్శకత్వం వహించిన  రెండు సినిమాలు మాయాబజార్, గుండమ్మ కథ. ఆ సినిమాలో వారు పాడిన పాటలు ఇప్పటికి ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన శతజయంతి  ఉత్సవాలు జరపడం గొప్ప విషయం. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఆయనకు  భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు.  

ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలని కోరారు.  విదేశాల్లోని తెలుగు సంస్థలు, ఇతర సంస్థలు ఏకతాటిపై వచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. 

ఈ సమావేశంలో గతంలో ఘంటసాల కార్యక్రమాలకు సాంకేతిక సహాయం అందించిన ప్రమీలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, ప్రముఖ సింగర్స్  గీత మాధురి, మాళవిక, ఇండియన్ ఐడల్ రన్నరప్ రోహిత్, అనురూప్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, శంకర్ నేత్రాలయ, యూఎస్‌ఏ బోర్డు సభ్యులు సౌమియా నారాయణన్, లక్ష్మయ్య తదితరులు  కార్యక‍్రమంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు