'చక్ర' మూవీ రివ్యూ!

20 Feb, 2021 00:00 IST|Sakshi

చిత్రం:  ‘విశాల్‌ చక్ర’;
తారాగణం: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా, కె.ఆర్‌. విజయ, మనోబాల;
మాటలు: రాజేశ్‌ ఎ. మూర్తి;
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా;
కెమేరా: కె.టి. బాలసుబ్రమణ్యం;
ఎడిటింగ్‌: త్యాగు;
నిర్మాణం: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ;
రచన – దర్శకత్వం: ఎం.ఎస్‌. ఆనందన్‌;
నిడివి: 131 నిమిషాలు;
రిలీజ్‌: ఫిబ్రవరి 19.

కొనుగోళ్ళ దగ్గర నుంచి ఇంటి సర్వీసుల దాకా ప్రతీదీ ఆన్‌లైన్, ఇంటర్నెట్‌ బేస్డ్‌ అయిపోయాక డిజిటల్‌ ప్రపంచంలో మన సమాచారం అంతా ఇట్టే లీకయ్యే ప్రమాదం తలెత్తింది. వైరస్‌ కన్నా వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ ప్రమాదమైందనే అంశాన్ని తీసుకొని, హ్యాకింగ్‌ను జతచేసి, క్రైమ్‌నూ, ఇన్వెస్టిగేషన్‌నూ కలిపితే? ఇలాæ చాలా లెక్కలు వేసుకొని కథ వండి, వడ్డిస్తే – అది ‘విశాల్‌ చక్ర’. 

కథేమిటంటే..:  మిలటరీ ఆఫీసర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ అలియాస్‌ చంద్రు (విశాల్‌) కుటుంబం మూడు తరాలుగా దేశం కోసం రక్తం ధారపోసిన కుటుంబం. అతని తండ్రి దివంగత మిలటరీ అధికారి. అశోక చక్ర పతకం పొందిన వీర జవాను. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే నగరంలో కాసేపట్లో 50 చోరీలు జరిగి, దాదాపు రూ. 7 కోట్ల విలువైన నగలు, డబ్బు పోతాయి. చంద్రు ఇంట్లో అతని నాయనమ్మ (కె.ఆర్‌. విజయ)ను కొట్టి, అశోక చక్ర పతకం కూడా దోచుకుపోతారు – ఇద్దరు ముసుగు దొంగలు. ఆ పతకాన్ని ప్రాణానికి ప్రాణంగా భావించే హీరో ఢిల్లీలోని మిలిటరీ ఆఫీసు నుంచి ఎకాయెకిన హైదరాబాద్‌ వచ్చేస్తాడు. ఆ కేసును పోలీసాఫీసరైన హీరో ప్రేయసి (శ్రద్ధా శ్రీనాథ్‌) డీల్‌ చేస్తుంటుంది. ఆ ఇద్దరూ కలసి, ఆ డిజిటల్‌ హ్యాకింగ్, సైబర్‌ క్రైమ్‌ స్టోరీని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. ఇంతకీ, ఆ నేరాలకు పాల్పడింది ఎవరు? ఎందుకు చేశారు? ఎలా చేశారు? అన్నది మిగతా కథ.

ఎలా చేశారంటే..:  నటన కన్నా విశాల్‌ ఎప్పటిలానే యాక్షన్‌ సీన్ల మీద, హీరోయిజమ్‌ మీద ఆధారపడ్డారు. వాటికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యర్థిగా రెజీనా కసండ్రా విలక్షణంగా కనిపించారు. కానీ, ఆ పాత్రకు కథలో కొంత బిల్డప్పూ ఎక్కువే ఇచ్చారు. పోలీసు అధికారిగా శ్రద్ధా శ్రీనాథ్‌ పాత్ర కూడా అంతే. సీనియర్‌ నటి కె.ఆర్‌. విజయది చాలా చిన్న పాత్ర. 

ఎలా తీశారంటే..:  డిజిటల్‌ క్రైమ్‌గా మొదలై, చివరకు ఆర్డినరీ విలన్‌ – హీరో ఎత్తులు పైయెత్తుల క్రైమ్‌ స్టోరీగా మారిపోతుందీ సినిమా. తొలి చిత్ర దర్శకుడైన ఎం.ఎస్‌. ఆనందన్‌ ఈ చిత్ర కథ, దానికి ప్రాతిపదిక బలంగా రాసుకున్నట్టు కనిపించదు. దానివల్ల సినిమా మొదట్లో కాసేపు – ఆ తరువాత ఛేజింగులు, హీరో విలన్ల మధ్య ఇంటెలిజెంట్‌ గేమ్‌ మరికాసేపు – ఆసక్తిగానే ఉన్నా, ఆ తరువాత రిపీట్‌ సీన్లు చూస్తున్న ఫీలింగ్‌ ఆడియన్స్‌కు వస్తుంది. నిజానికి, ఫస్టాఫ్‌ కాస్తంత వేగంగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. కానీ, సెకండాఫ్‌ లో సినిమా వేగం తగ్గింది. కథ అక్కడక్కడే తిరుగుతుంది. 

విలన్‌ ఎందుకు ఈ దొంగతనాలు, దోపిడీలు చేయిస్తోందన్నదానికి సరైన ప్రాతిపదిక ఉన్నట్టు కనిపించదు. అలాగే, ఇంట్లోవాళ్ళ మీద కోపం సరే... సమాజం మీద విలన్‌ ఆగ్రహానికి లాజిక్‌ చూపలేదు. సవతి తమ్ముళ్ళను అలా మార్చడమూ అంతే. ఇక, విలన్‌ ఎత్తులు పైయెత్తులు వేస్తుందనడం కోసమో ఏమో కానీ – చదరంగం ఆటను బలవంతంగా తెర మీదకు తెచ్చారు. తమిళనాట నటుడు విశాల్‌కు ఉన్న రాజకీయ ఉద్దేశాల ప్రకటన కోసమో ఏమో, పొలిటికల్‌ పంచ్‌ డైలాగ్స్‌ కూడా విస్తతంగా సన్నివేశాల్లో ఇరికించారు. అంతా అయిపోయాక, గేమ్‌ జస్ట్‌ బిగిన్స్‌ అంటూ సీక్వెల్‌ వస్తుందనే భయమూ పెట్టారు. పోలీసు వ్యవస్థకూ, మిలటరీ అధికారి తెలివితెటలకూ ముడిపెడుతూ, హద్దులు చెరిపేసే కథగా ‘విశాల్‌ చక్ర’ గుర్తుండిపోతుంది. అధికారికంగా ప్రకటించకపోయినా, గతంలో బాగా ఆడిన విశాల్‌ ‘అభిమన్యుడు’ (తమిళంలో ‘ఇరుంబు తిరై’ – 2018)తో ఈ సినిమాకూ, కథకూ పోలికలు కనిపిస్తాయి. అయితే, ఆదరణలోనూ మళ్ళీ ఆ ఛాయలు కనపడతాయా అన్నది అనుమానమే!

కొసమెరుపు:  ఆగక సాగే ఛేజులు, ఛాలెంజ్‌లతో (బుర్ర) గిర్రున తిరిగే చక్రం!

బలాలు:
♦గత హిట్టయిన ‘అభిమన్యుడు’  (2018) చిత్ర ఫార్ములా ఛాయలు 
♦చకచకా సాగే ఫస్టాఫ్‌
♦నేపథ్యగీతం మినహా పాటలు లేకపోవడం
బలహీనతలు:
♦వీక్‌ అండ్‌ ప్రిడిక్టబుల్‌ స్టోరీ
♦సెకండాఫ్‌
♦కథనంలో లోపాలు
♦కథకు అడ్డుపడే పొలిటికల్‌ పంచ్‌లు

రివ్యూ: రెంటాల జయదేవ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు