Vishal Chandrasekhar: మ్యూజిక్‌ని డిమాండ్‌ చేసిన కథ ‘సీతారామం’

28 Jul, 2022 07:18 IST|Sakshi

‘‘నేను ఏ సినిమా చేసినా ఆ కథ వినను.. స్క్రిప్ట్‌ పూర్తిగా చదువుతాను. అప్పుడే ఎలాంటి మ్యూజిక్‌ ఇవ్వాలో ఓ అవగాహన వస్తుంది. మంచి సంగీతం కుదరాలంటే కథ మ్యూజిక్‌ని డిమాండ్‌ చేయాలి. అప్పుడే మంచి పాట వస్తుంది. అలా మ్యూజిక్‌ని డిమాండ్‌ చేసిన కథ ‘సీతారామం’. ఈ చిత్రకథ ఇచ్చిన స్ఫూర్తితో అద్భుతమైన సంగీతం ఇచ్చాను’’ అని సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌ 5న విడుదలవుతోంది.  ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘రంజిత్‌ బారోట్‌ అనే సంగీత దర్శకుడు నాకు స్ఫూర్తి. తమిళ్‌లో ప్రభుదేవా హీరోగా ‘వీఐపీ’ అనే సినిమాతో పాటు మరో చిత్రానికి సంగీతం అందించారాయన. ప్రస్తుతం ఏఆర్‌ రెహమాన్‌గారి ట్రూప్‌లో మెయిన్‌ డ్రమ్మర్‌.

హను రాఘవపూడిగారితో ‘పడిపడి లేచే మనసు’ సినిమా చేశాను. ఆయన కథ రాసుకునే విధానం బాగుంటుంది. ‘సీతారామం’ వంటి చాలా గొప్ప కథ రాశారు. ఈ చిత్రంలో 9 పాటలు ఉన్నాయి. జర్మనీ, యుఎస్, ఫ్రాన్స్‌... ఇలా విదేశీ వాయిద్యకారులతో పాటు దాదాపు 140మంది మ్యుజీయన్స్‌ కలిసి నేపథ్య సంగీతం కోసం పని చేశారు.

ఈ సినిమాలోని ‘కానున్న కల్యాణం..’ పాటని ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు రాశారు. ఈ పాట కంపోజ్‌ చేసినప్పుడు స్టూడియోకి వచ్చిన ఆయన తెలుగు, తమిళ్‌.. ఇలా అన్ని భాషల్లోని అలంకారాల గురించి నాకు వివరించారు.

పాటల రచయితలు కేకేగారు, అనంత్‌ శ్రీరామ్‌లతో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాలోని పాటలని డబ్బింగ్‌లా కాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆ నేటివిటీకి తగ్గట్టు ఒరిజినల్‌గా చేశాం. మెలోడీ పాటలు నా బలం. నా తర్వాతి సినిమా మాధవన్‌గారితో ఉంటుంది.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు