Vishal : ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన హీరో విశాల్‌ జట్టు

21 Mar, 2022 08:33 IST|Sakshi

దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) ఎన్నికల్లో విశాల్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. గత 2019 జూన్‌ 23వ తేదీ ఈ సంఘానికి ఎన్నికలు జరిగాయి. పాండవర్‌ జట్టు పేరుతో నాజర్‌ అధ్యక్షుడిగా విశాల్‌ జట్టు, శంకర్‌దాస్‌ పేరుతో భాగ్యరాజ్‌ అధ్యక్షుడిగా ఐసరి గణేష్‌  జట్టు పోటీ పడ్డాయి. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎన్నికలను రద్దు చేయాలంటూ ఐసరి గణేష్‌ జట్టు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.


ఎన్నికలు సక్రమమే అని ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చి ఓట్ల లెక్కింపునకు ఆదేశించింది. దీంతో ఆదివారం ఉదయం స్థానిక నుంగంబాక్కంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో విశ్రాంతి న్యాయమూర్తి పద్మనాభన్‌ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. తపాలా ఓట్ల నుంచే విశాల్‌ జట్టు భారీ ఆధిక్యంతో దూసుకుపోయింది.


ఒక దశలో ఉపాధ్యక్షుడికి పోల్‌ అయిన ఓట్ల కంటే 7, 8 ఓట్లు అధికంగా లెక్కింపులో వచ్చాయంటూ శంకర్‌దాస్‌ జట్టుకు చెందిన ఐసరి గణేష్‌ ఫిర్యాదు చేయడంతో కౌంటింగ్‌ ప్రక్రియ కొంచెంసేపు నిలిచిపోయింది. అయితే విశాల్‌ జట్టు భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. కాగా నడిగర్‌ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన విశాల్‌ వర్గానికి తమిళ నిర్మాతల మండలి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటనలో విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు