త్వరలోనే తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నాను: హీరో

22 Mar, 2021 11:40 IST|Sakshi
గుత్తా జ్వాల-విష్ణు విశాల్ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)‌

అతి త్వరలో మా పెళ్లి తేదిని ప్రకటిస్తాం: విష్ణు విశాల్‌

భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే తాను తెలుగింటి అల్లుడిని కాబోతున్నట్లు ప్రకటించాడు విష్ణ విశాల్‌. అరణ్య సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ఈ ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా విష్ణు విశాల్‌ మాట్లాడుతూ.. ‘‘మూడు భాషల్లో నటిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ జ్వాలా ఎంకరేజ్‌మెంట్‌, మద్దతుతో నేను ధైర్యం చేయగలిగాను. అతి త్వరలోనే మేం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం. తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మా పెళ్లి తేదిని ప్రకటిస్తాం’’ అన్నారు. 

ఈ నెల 26న అరణ్య చిత్రం విడుదల కానుంది. దీనిలో విష్ణు విశాల్‌ మావటి(ఏనుగులను అదుపు చేసే వ్యక్తి) పాత్రలో నటించాడు. రానా హీరోగా నటిస్తున్న అరణ్య చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్‌ దర్శకుడు. 25 ఏళ్లుగా అడవిలో జీవించే ఒక వ్యక్తి కథ ఇది. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించే సినిమా. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 

రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట.. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘హ్యాపీ బర్త్‌డే గుత్త జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్‌, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు విష్టు విశాల్‌. వీరిద్దరికి గతంలోనే వివాహం అయ్యింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరు తమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. 

చదవండి:
మాల్దీవుల్లో ప్రేమ పక్షులు.. రొమాంటిక్‌ ఫోటోస్‌

ఆనంద‌పు క్ష‌ణాలు..తోడు ఉండాల్సిందే

మరిన్ని వార్తలు