Vishwak Sen: ఆ స్టార్‌ హీరో దేవుడిలా నిలబడ్డారు : విశ్వక్‌ సేన్‌

8 Oct, 2022 09:03 IST|Sakshi

విశ్వక్‌ సేన్‌ విశ్వక్‌ సేన్, మిథిలా పార్కర్, ఆశా భట్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా..!’. వెంకటేశ్‌ ఓ లీడ్‌ రోల్‌ చేశారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్‌’కు ఎవరైనా సపోర్ట్‌ చేస్తే బాగుంటుందనుకుంటున్న సమయంలో వెంకటేశ్‌గారు దేవుడిలా అండగా నిలబడి ఆ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇప్పుడు ఈ సినిమాలో ఆయన దేవుడి పాత్రలో నటించారు. కల్మషం లేని మనిషి ఆయన. నాకు బ్రదర్‌ ఉంటే ఆయనలా ఉండాలనిపించింది. వెంకటేశ్‌గారికి థ్యాంక్స్‌. ఇక ‘ఓరి దేవుడా..!’ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ‘ఓరి దేవుడా..!’ సినిమాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా నా కెరీర్‌ ఉంటుందనుకుంటున్నాను. ఇంత మంచి సినిమాను ఇచ్చిన పీవీపీగారికి థ్యాంక్స్‌. ఈ సినిమాతో విశ్వక్‌ ఎమోషన్స్‌ను ఇంకా బాగా క్యారీ చేయగలడని మాట్లాడుకుంటారు’’ అన్నారు.

‘‘తెలుగు సినిమా చేయాలన్న నా డ్రీమ్‌ ‘ఓరి దేవుడా..!’తో నెరవేరింది. ఇందులో విశ్వక్‌ కొత్తగా కనిపిస్తాడు. ట్రైలర్‌ను ఎలా ఎంజాయ్‌ చేశారో, సినిమాను అలానే ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు అశ్వత్‌ మారిముత్తు. ‘‘దేవుడి పాత్రలో వెంకటేశ్‌గారు అద్భుతంగా నటించారు. ‘బొమ్మరిల్లు’, ‘తొలి ప్రేమ’ సినిమాల అంతటి హిట్‌ విశ్వక్‌ సేన్‌కు ఈ సినిమాతో వస్తుంది’’ అన్నారు నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి.

మరిన్ని వార్తలు