ఆ ఆరోపణలు అబద్ధమని నిరూపించిన విశ్వక్‌ సేన్‌

7 May, 2021 12:14 IST|Sakshi

2017లో 'వెళ్లిపోమాకే' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు విశ్వక్‌ సేన్‌. తొలి సినిమాతోనే సైమా అవార్డు కొట్టేసిన ఈ యంగ్‌ హీరో 'ఫలక్‌నుమా దాస్‌'తో దర్శకుడు, రచయిత, సహ నిర్మాతగా అవతారం ఎత్తాడు. ఈ సినిమాతో పాటు ఆ తర్వాత వచ్చిన 'హిట్‌' కూడా ప్రేక్షకులను మెప్పించడంతో యూత్‌ ఫేవరెట్‌ స్టార్‌గా నిలిచాడీ యంగ్‌ హీరో. ఇదిలా వుంటే విశ్వక్‌ సేన్‌ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

తన అసలు పేరు దినేశ్‌ కార్తీక్‌ అని, జాతకాల ప్రకారం దాన్ని విశ్వక్‌ సేన్‌గా మార్చుకున్నట్లు తెలిపాడు. ఇది బెంగాలీ పేరు అని, తండ్రే స్వయంగా తనకు ఈ పేరు మార్చాడని పేర్కొన్నాడు. నిజానికి తనకు ఓ వైపు నటించడంతో పాటు దర్శకత్వం చేయాలనే ఆలోచన 7వ తరగతిలోనే పురుడు పోసుకుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చాక తనలాంటి కొత్తవాడిని పెట్టుకుని సినిమా ఎవరు తీస్తారని, అందుకే సొంతంగా సినిమా చేయాలనుకున్నాని మనసులోని మాటను బయటపెట్టాడు.

కానీ ఆ సమయంలో తరుణ్‌ భాస్కర్‌.. 'ఈ అబ్బాయి బాగున్నాడు, పిలవండి' అని చెప్పడంతో తరుణ్‌ను కలిశాడు విశ్వక్‌. అప్పుడు ఆయన 'ఫలక్‌నుమాదాస్‌ తీస్తున్నావంట కదా, మరి నా సినిమా చేస్తావా?' అని అడిగాడు. అవకాశం తనను వెతుక్కుంటూ రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన విశ్వక్‌.. 'మీరు సినిమా చాన్స్‌ ఇస్తే నా సినిమా ఆపేస్తా' అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో తరుణ్‌కు అతడి మీద ఎనలేని నమ్మకం కలిగింది. అలా 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాలో అవకాశం వచ్చింది.

కానీ అతడి ఆశల మీద నీళ్లు చల్లుతూ.. విశ్వక్‌ అసలు మంచివాడు కాదంటూ తరుణ్‌కు ఓ మెయిల్‌ వచ్చింది. 'విశ్వక్‌ సేన్‌ నాకు మత్తు మందు ఇచ్చి, నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా పరిస్థితి ఏ హీరోయిన్‌కీ రావద్దు. మీరు వాడిని సినిమాలో పెట్టుకుంటే మీడియా ముందుకెళ్లి ఏం చేయాలో నాకు తెలుసు' అంటూ వార్నింగ్‌ ఇచ్చిందో అమ్మాయి. ఇది తెలిసిన విశ్వక్‌..  ఇదంతా తను అంటే గిట్టనివాళ్లు చేశారని భావించాడు. ఎవరో కుట్ర పన్ని కావాలని ఇదంతా చేశాడని నిరూపించాడు. అలా తరుణ్‌ దర్శకత్వంలో 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాలో నటించాడు.

చదవండి: నీ మీద ఒట్టు, చ‌చ్చిపోతా: విశ్వ‌క్‌సేన్‌కు బెదిరింపులు

మరిన్ని వార్తలు