తల్లిలా పెంచుకున్న.. పెళ్లి చేశా: వితిక భావోద్వేగం

12 Jan, 2021 14:49 IST|Sakshi

‘‘నా బంగారు తల్లి.. నీ పెళ్లి గురించి, నా పెళ్లి కంటే ఎక్కువ కలలు కన్నాను. అందుకే కష్టపడి, చాలా ఇష్టపడి నీ పెళ్లి చేశాను. నువ్వు నాకు చెల్లిలా పుట్టావు.. కానీ నేను నిన్ను తల్లిలా పెంచుకున్నా. మీ పెళ్లి చేయాలనే ఇరవై ఏళ్ల నా కల ఇప్పుడు నెరవేరింది. నా చేతుల మీదుగా ఇది జరగడం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. నీకోసం నేను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. నీ కొత్త ఇంట్లో నీకు అన్ని సంతోషాలు దక్కాలి. నన్ను గర్వపడేలా చేశావు. ఐ లవ్‌ యూ.. హ్యాపీ మారీడ్‌ లైఫ్‌. మీ జంటను ఆ దేవుడు ఆశీర్వదించాలి. క్రిష్‌ బాగా చూసుకో’’  అంటూ నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వితికా షేరు భావోద్వేగ పోస్టు షేర్‌ చేశారు.  ‘‘కలకాలం నవ్వుతూ ఉండు. నాకు అదే చాలు’’ అని ఉద్వేగానికి లోనయ్యారు.

అదే విధంగా.. ‘‘1997 నుంచి నీకు కాపు కాస్తూనే ఉన్నాను. అవును.. బొమ్మరిల్లు ప్రకాశ్‌ రాజ్‌ ఫీమేల్‌ వర్షన్‌ నేను’’ అని కృతిక పెంపకంలో తన పాత్ర గురించి చమత్కరించారు. తన చెల్లెలు కృతికా షేరు పెళ్లి సందర్భంగా తనపై ఉన్న ఈ ప్రేమను వితిక ఈ విధంగా చాటుకున్నారు. అలాగే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన.. వితికా వారి జంట కలకాలం ఇలాగే కలిసి ఉండాలని ఆకాంక్షించారు. అంతా తానై చెల్లెలి పెళ్లిని దగ్గరుండి జరిపించినందుకు గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.(చదవండి: సింగర్‌ సునీత పెళ్లి: కత్తి మహేష్‌ కామెంట్స్‌ )

కాగా కృతికా- కృష్ణల వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్‌ జంట వరుణ్‌ సందేశ్‌- వితికా షేరు కుటుంబానికి సంబంధించిన ఈ వేడుకలో బిగ్‌బాస్‌-3 కంటెస్టెంట్స్‌ పాల్గొని సందడి చేశారు. నటి పునర్నవి సంప్రదాయ వస్త్రధారణలో ఈ గ్యాంగ్‌లో సెంటరాఫ్‌ అట్రాక‌్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

A post shared by Vithika Sheru (@vithikasheru)

మరిన్ని వార్తలు