Vivek Oberoi: ఆయన కంపెనీ ఎన్నో నేర్పింది

1 Dec, 2022 18:18 IST|Sakshi

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన కంపెనీ సినిమా తనకు ఎన్నో నేర్పిందని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ చెప్పాడు. ఆ సినిమా తనకు తొలి పాఠం మాత్రమే కాదు నిత్యం మననం చేసుకునే పాఠం కూడా అంటున్నాడు.ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒకటైన ఎంఎక్స్‌ రూపొందించిన ఒరిజినల్‌ సిరీస్‌ ‘ ధారావీ బ్యాంక్‌’ లో వివేక్‌... పవర్‌ఫుల్‌ జెసెపీ జయంత్‌ గవాస్కర్‌ పాత్ర పోషించారు. రూల్‌బుక్‌కు కట్టుబడి ఉండాల్సిన పనిలేని,  తనకు అనుకూలమైన రీతిలో నిబంధనలను మార్చుకునే తత్త్వమున్న పోలీస్‌గా  ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పాత్ర ప్రశంసలు అందుకుంటున్న సందర్భంగా స్పందించిన వివేక్‌.. నటన వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లుగా ఉండటమే జయంత్‌ గవాస్కర్‌గా తాను ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్‌ అన్నాడు.

ఈ సందర్భంగా తన తొలి చిత్రం ‘కంపెనీ’ ని గుర్తు చేసుకున్నాడు. కంపెనీ  నా తొలి చిత్రమే అయినప్పటికీ దానిలో నేర్చుకునేందుకు ఎంతో ఉండడం నాకు మేలు చేసింది. ఆ  సినిమాలో అద్భుతమైన నటులు అజయ్‌దేవగన్, మోహన్‌లాల్‌  వంటి నటులు చేశారు. ధారావీ బ్యాంక్‌ కోసం నేను మోహన్‌లాల్‌ సర్‌ నటనా చాతుర్యం పరిశీలించడానికి పదే పదే ఆ సినిమా చూశాను. ఆయన దానిలో  ముంబై పొలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ వీరపల్లి శ్రీనివాసన్, ఐపీఎస్, గా చేశారు. తన సీన్స్‌ అద్భుతంగా రావడం కోసం ఆయన అనుసరించిన విధానం నాకిప్పటికీ గుర్తే’’ అని అన్నారు.

అనుభవంతో కూడిన టెక్నిక్‌ ఆయనది. ఆయన పాత్రలో అవలీలగా ఒదిగిపోతారు. ఆయన ఆ క్యారెక్టర్‌కు ఆయన సిద్ధమయ్యే తీరు స్ఫూర్తిదాయకం. ఈ క్యారెక్టర్‌ కోసం నేను ఆయన ఉపయోగించిన కొన్ని ట్రిక్స్‌ చేశాను. దానితో పాటుగా ముంబైలో ఎంతోమంది పోలీసులతో  నాకున్న పరిచయాలు, వారి మార్గనిర్థేశనం ఈ క్యారెక్టర్‌ గొప్పగా రావడానికి తోడ్పడిందన్నాడు. ముంబయిలోని ధారావీ  గోడల మధ్య విస్తరించిన నేర సామ్రాజ్యపు శక్తివంతమైన కథ ధారావీ బ్యాంక్‌ ఇది. రూ.30వేల కోట్ల రూపాయలకు పైగా విలువ  కలిగిన ఆర్ధిక నేరసామ్రాజ్య మూలాలను అన్వేషించే ఓ అవిశ్రాంత పోలీస్‌ ప్రయత్నమే ఈ సిరీస్‌. ఉద్విగ్నభరితంగా సాగే కథనం కూడా  తోడు కావడంతో ఈ 10 ఎపిసోడ్ల సిరీస్‌ ఇప్పటికే వీక్షకుల ఆదరణ పొందింది.

మరిన్ని వార్తలు