అందరి కన్నూ ప్రధాని కుర్చీ మీదే..

16 Jan, 2021 08:28 IST|Sakshi

వెబ్‌ సిరీస్‌ రివ్యూ – తాండవ్‌

రాజకీయాలు వ్యాఖ్యానించే సినిమాలు బాలీవుడ్‌లో కొత్త కాదు. కాని కొన్ని సినిమాలే శక్తిమంతంగా తెర వెనుక భాగోతాలను చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గతంలో ప్రకాష్‌ ఝా దర్శకత్వంలో ‘రాజ్‌నీతి’ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. రణ్‌బీర్‌ కపూర్, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు ఇందులో నటించారు. ఈ సినిమా ఉత్తరప్రదేశ్‌ తరహా రాష్ట్ర రాజకీయాలను చర్చించింది. ఇప్పుడు అమేజాన్‌లో జనవరి 15 నుంచి స్ట్రీమ్‌ అవుతున్న ‘తాండవ్‌’ వెబ్‌ సిరీస్‌ దేశ రాజకీయాలను చర్చించే ప్రయత్నం చేసింది. 9 ఎపిసోడ్ల ఈ సిరీస్‌ ప్రధానంగా ప్రధాని కుర్చీ ఎక్కడానికి నేతలు ఏయే ఆటలు ఆడతారో చెప్పే ప్రయత్నం చేస్తుంది. 

అలీ అబ్బాస్‌ దర్శకత్వంలో
‘గుండె’, ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి భారీ సినిమాలు తీసిన దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఓటిటి ప్లాట్‌ఫామ్‌ మీద మొదటిసారిగా పొలిటికల్‌ డ్రామాతో కూడిన వెబ్‌ సిరీస్‌ ‘తాండవ్‌’తో ఎంట్రీ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అందుకు దేశ రాజకీయాలను వస్తువుగా తీసుకున్నాడు. ‘మీరు ఈ కథను చూస్తే ఏది సరైన నిర్ణయం ఏది కాదు అనేది నిర్ణయించలేరు. అధికారం కోసం ఏ పని చేసినా సరైనదే అనే అభిప్రాయానికి వస్తారు’ అంటాడతను. సైఫ్‌ అలీ ఖాన్, డింపుల్‌ కపాడియా ఇందులో ప్రధాన తారాగణం. సునీల్‌ గ్రోవర్, క్రితికా కమ్రా, డినో మోరియా తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (చదవండి: హిందూస్తాన్‌ను‌ నడిపించేది ఒకటే.. అది రాజనీతి)

ఆ కుర్చీపై కూర్చోవడం ఎలా?
ఈ సిరీస్‌లో ప్రధానిగా తిగ్‌మాన్షు థులియా అధికారం చలాయిస్తూ ఉంటాడు. అయితే అతని కుమారుడైన సైఫ్‌ అలీ ఖాన్‌కి ఆ కుర్చీలో కూచోవాలని ఉంటుంది. అందుకు తగినట్టుగా పావులు కదిలిస్తాడు. చదరంగం బల్ల మీద మన ఎత్తు మనం ఎత్తవచ్చు. కాని ఎదుటివాడు ఎత్తు వేయడానికి కూడా చాన్స్‌ ఇచ్చినవారం అవుతాము. ఎప్పుడైతే సైఫ్‌ రంగంలోకి దిగాడో ప్రధాని కుర్చీ మీద ఆశలు పెట్టుకున్నవారంతా కదలుతారు. వారిలో ఒకరు డింపుల్‌ కపాడియా. ఈమె పార్టీ సీనియర్‌ కార్యకర్త. దాంతో పాటు ప్రధాని ప్రియురాలు కూడా. ఆమె తన గేమ్‌ మొదలెడుతుంది. ఈమెతో పాటు ప్రధాని కోటరీలో ఉండే మరో మహిళ కూడా రంగంలో దిగుతుంది. (చదవండి: జీవితాంతం నువ్వు నా దానివే..: దర్శకుడు)

వర్తమాన ఘటనలు
ఈ సిరీస్‌లో వర్తమాన ఘటనలను పోలిన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమాలో ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ‘రైట్‌ వింగ్‌’ పార్టీ అని సంకేతం ఇస్తాడు దర్శకుడు. అలాగే ‘లెఫ్ట్‌ వింగ్‌’ పార్టీలు బయట విమర్శలు చేస్తూ దేశ పరిస్థితి మీద వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. మరోవైపు ఒక యూనివర్సిటీ లో ఉవ్వెత్తున ఎగిసిన స్టూడెంట్‌ ఉద్యమం కూడా కనిపిస్తుంది. దేశ రాజకీయాలను మార్చాలనే విద్యార్థి నాయకులకు ప్రతినిధిగా నటుడు జీషాన్‌ అయూబ్‌ కనిపిస్తాడు. మూస రాజకీయాలకు ఇటువంటి విద్యార్థి రాజకీయాల నుంచి భంగం తప్పకపోవచ్చు అనే సంకేతం కూడా ఉంటుంది. సామాన్యుడి ఊహకు కూడా అందని ఎన్నో రాజకోట రహస్యాలు దేశంలో జరుగుతూ ఉంటాయి. వాటిలో ఎన్నో కొన్ని ఇలా ఫిక్షన్‌ రూపు తీసుకుంటూ ఉంటాయి. ఈ సిరీస్‌ గొప్ప హిట్‌ అవకపోవచ్చు. కాకపోతే డింపుల్‌ కపాడియా వంటి ఆర్టిస్టుల ప్రతిభకు అద్దం పడుతుంది. రాజకీయాలు ఆసక్తి ఉన్నవారు తప్పక చూడదగ్గ సిరీస్‌ ఇది. 
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు