ఆ నటుడితో కాంగ్రెస్‌కు గొడవ ఎందుకు?

15 Nov, 2021 20:00 IST|Sakshi

వివాదంలో మలయాళ నటుడు జోజు జార్జ్ 

క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ 

తన తప్పు లేదన్న జార్జ్

కొనసాగుతున్న కాంగ్రెస్‌ నిరసనలు

మలయాళ నటుడు జోజు జార్జ్.. ఇప్పుడు కేరళ కాంగ్రెస్‌ పార్టీకి లక్ష్యంగా మారారు. అతడు బహిరంగ క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టబోమని కాంగ్రెస్‌ నేతలు అంటుంటే.. తాను ఏ తప్పు చేయలేదని జార్జ్ చెబుతున్నాడు. అసలు హస్తం పార్టీ అతడిని ఎందుకు టార్గెట్‌ చేసింది? జార్జ్‌ చేసిన తప్పేంటి?


అసలు కథ ఇక్కడి నుంచే..

పెరిగిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా నవంబర్‌ 1న కొచ్చిలో కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. వైట్టిల-ఎడపల్లి జాతీయ రహదారిపై నిరసనకారులు బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు దాదాపు గంటల పాటు యాతన అనుభవించారు. జోజు జార్జ్.. కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో కూతురిని కీమోథెరపికి తీసుకెళుతున్న ఓ మహిళ పక్షాన కాంగ్రెస్‌ కార్యకర్తలతో అతడు వాగ్వాదానికి దిగాడు. గట్టిగా నిలదీయడంతో కోపోద్రిక్తులయిన కాంగీయులు జార్జ్ కారు అద్దాలను పగులగొట్టారు. దీంతో బాధ్యులపై పోలీసులు పలు సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది.


తలపొగరు తగ్గాలి

జోజు జార్జ్.. తమ పార్టీ మహిళా కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించాడని కాంగ్రెస్‌ ఆరోపించింది. వీధి రౌడీలా ప్రవర్తించాడని, అతడి తలపొగరు తగ్గాలంటే చట్టప్రకారం శిక్షించాలని పీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. జోజు జార్జ్‌ను నిందించే ప్రయత్నంలో సినీ పరిశ్రమను కూడా కాంగ్రెస్‌ పార్టీ టార్గెట్‌ చేసింది. సినిమా షూటింగ్స్‌ వద్ద హడావుడి చే​స్తూ శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్.. కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాష్ట్రంలో సినిమా షూటింగులను అడ్డుకుంటే సహించేది లేదని అసెంబ్లీలో వార్నింగ్‌ ఇచ్చారు. (చదవండి: కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం..)


సోషల్‌ మీడియాకు దూరం

కాంగ్రెస్‌ పార్టీతో కలహం నేపథ్యంలో గత రెండు వారాల నుంచి జోజు జార్జ్ సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సన్నిహితులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. త్రిసూర్ జిల్లాలోని మాలా గ్రామంలో ఉన్న తన ఇంటి ముందు స్థానిక కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంతో కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు. (చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!!)


జీరో టు హీరో!

త్రిస్సూర్ జిల్లాలోని కూజూర్ గ్రామంలో జన్మించిన జోజు జార్జ్.. సినీ పరిశ్రమలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర నటుడిగా ఎదిగారు. 1995లో ‘మజవిల్కూడారం’ సినిమాలో చిన్న వేషంతో కెరీర్‌ మొదలు పెట్టిన ఆయనకు 2000లో ‘దాదా సాహెబ్’ సినిమాలో తొలిసారిగా డైలాగ్ చెప్పే అవకాశం లభించింది. అప్పటి నుంచి హాస్య పాత్రలు చేస్తూ వచ్చిన జార్జ్‌కు 2018లో వచ్చిన ‘జోసఫ్‌’ సినిమాతో బ్రేక్‌ వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టడంతో జోజు జార్జ్‌కు హీరో ఇమేజ్‌ ఇచ్చింది. (Jai Bhim: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది)


టార్గెట్‌ చేయడం కరెక్ట్‌ కాదు

ఎంతో కష్టపడి కిందిస్థాయి నుంచి సినిమా పరిశ్రమలో ఎదిగిన జోజు జార్జ్‌ను రాజకీయ నేతలు టార్గెట్‌ చేయడం సరికాదని అతడి సన్నిహితులు అంటున్నారు. కెరీర్‌లో ఎన్ని విజయాలు అందుకున్నా ఇప్పటికీ మూలాలు మరిచిపోలేదని, సాధారణ గ్రామస్తుడిలానే జీవిస్తారని వెల్లడించారు. బెదిరింపులతో జార్జ్‌ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించడం ఏమీ బాలేదని చెబుతున్నారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని ప్రముఖ నిర్మాత, కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి. ఉన్నికృష్ణన్ కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత సతీషన్‌కు లేఖ కూడా రాశారు. (Jai Bhim: హీరో సూర్యకు బెదిరింపులు.. దాడి చేస్తే రూ. లక్ష బహుమతి!)

క్షమాపణ చెప్పాల్సిందే
అయితే జోజు జార్జ్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకు వెనక్కు తగ్గేది లేదని ఎర్నాకులం జిల్లా కమిటీ చీఫ్, పీసీసీ అధ్యక్షుడు భీష్మించుకుని కూర్చున్నారు. అటు జార్జ్‌.. కూడా క్షమాపణ చెప్పేందుకు ససేమీరా అనడంతో వివాదం సద్దుమణగలేదు. కాగా, చమురు ధరల పెరుగుదలకు నిరసనగా తాము చేపట్టిన ఆందోళనల లక్ష్యం నెరవేరలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కేంద్రం, కేరళ ప్రభుత్వాలను ఆత్మరక్షణలో పడేసే గొప్ప అవకాశాన్ని పార్టీ చేజార్చకుందన్నారు. జోజుపై దాడి, అతనిపై దురుద్దేశపూరిత ప్రచారం నిరసనల గమనాన్ని మార్చిందని విశ్లేషించారు. (చదవండి: ప్రకాశ్‌రాజ్‌ మౌనవ్రతం..దానికోసమే అంటూ ట్వీట్‌)

మరిన్ని వార్తలు