Dhanush: నువ్వు హీరో ఏంట్రా? అంటూ హేళన చేశారు

7 Jul, 2022 21:00 IST|Sakshi

సౌత్‌లో స్టార్‌గా వెలుగొందుతున్న ధనుష్‌ 'ద గ్రే మ్యాన్‌'తో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో ధనుష్‌ అవతారాన్ని చూసిన పలువురు నువ్వు హీరోనా? అంటూ ఎగతాళి చేశారట. 2003లో కాదల్‌ కొందెన్‌ సినిమా చిత్రీకరణ సమయంలో కొందరు సెట్స్‌లోనే తనను ఎగతాళి చేస్తూ మాట్లాడారట. దీంతో వారి హేళనను తట్టుకోలేకపోయిన ధనుష్‌ తన గదిలోకి వెళ్లి గట్టిగా ఏడ్చేశాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

2002లో తుళ్లువాదో ఇలమై సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు ధనుష్‌. ఈ సినిమాకు అతడి తండ్రి కస్తూరి రాజా దర్శకత్వం వహించారు. ఈ మూవీ హిట్‌ అయిన తర్వాత అతడు నటించిన 3, మర్యన్‌, అనేకన్‌, కోడి, వడచెన్నై, అసురన్‌ వంటి పలు సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. అయితే కెరీర్‌ తొలినాళ్లనాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనలయ్యాడు ధనుష్‌.

2015 నాటి ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. కాదల్‌ కొండెన్‌ సినిమా షూటింగ్‌లో కొందరు నా దగ్గరకు వచ్చి ఇక్కడ హీరో ఎవరు? అని అడిగారు. అవమానాలు పడటం ఇష్టం లేక నేను అక్కడున్న ఎవరో ఒకరివైపు వేలు చూపించాను. కానీ తర్వాత వారు నేనే హీరో అని తెలుసుకుని పడీపడీ నవ్వారు. ఆటో డ్రైవర్‌లా ఉన్నాడు, వీడు హీరో అంట అంటూ హేళన చేశారు. నేను వెంటనే నా కారెక్కి బోరుమని ఏడ్చేశాను. అసలు నన్ను ఎగతాళి చేయని, ట్రోల్‌ చేయని ఒక్క వ్యక్తి కూడా లేడంటే నమ్ముతారా? కానీ తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకుని ఆటో డ్రైవర్‌ హీరో కాకూడదా? అని ధైర్యం కూడగట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు ధనుష్‌.

చదవండి: నిశ్చితార్థం బ్రేక్‌ అయ్యాక ప్రేమలో పడ్డ విశాల్
‘కాళీ’ పోస్టర్‌ వివాదం.. డైరెక్టర్‌ పోస్ట్‌ డిలిట్‌ చేసిన ట్విటర్‌

మరిన్ని వార్తలు