గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి

16 Jun, 2021 13:22 IST|Sakshi

ఆసక్తికర విషయాలు వెల్లడించిన నీనా గుప్తా

బాలీవుడ్‌ సీనియర్‌ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె జీవితం సినిమా స్టోరీకి తీసిపోదు. తెరమీద ఎంత అందంగా వెలిగిపోయారో.. నిజ జీవితంలో అంతకు మించిన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సింగిల్‌ పేరెంట్స్‌ని ఇప్పటికి వింతగా చూస్తారు మన సమాజంలో. అలాంటిది ఆమె 90లలోనే సింగిల్‌ పేరెంట్‌గా మారారు. మాజీ వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో సహజీవనం చేశారు. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయారు. ఆ తర్వాత మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. ఈ క్రమంలో నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్‌ కహున్‌ తో’లో తాను గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి తెలిపారు. 

ఆ వివరాలు ఆమె మాటల్లోనే...‘‘గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి నా స్నేహితుడు సతీష్‌ కౌశిక్‌ నా దగ్గరకు వచ్చాడు. ‘‘దీని గురించి ఏం బాధపడకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పుట్టబోయే బిడ్డ మన బిడ్డ అవుతుంది. తను నీలా తెల్లగా పుడితే ఇబ్బంది లేదు. అలా కాకుండా డార్క్‌ కలర్‌లో ఉంటే.. నా పోలిక అని చెప్పవచ్చు. అప్పుడు ఎవరు అనుమానించరు’’ అన్నాడు’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. సతీష్‌ కౌశిక్‌, నీనా గుప్తా ఇద్దరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రోజుల నుంచి స్నేహితులు. అయితే సతీష్‌ ప్రతిపాదనను తిరస్కరించారు నీనా. ఆ తర్వాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన అకౌంటెంట్‌ వివేక్‌ మెహ్రాను వివాహం చేసుకున్నారు.

తనకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక అంశాలను తన బయోగ్రఫీలో వెల్లడించారు నీనా గుప్తా. ఇక పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో ఇండస్ట్రీ తనను చెడుగా చూసేదని చెప్పారు. ఆ ప్రభావం తన కెరీర్‌ మీద కూడా పడిందని వివరించారు. ఫలితంగా తనకు నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ ఇచ్చేవారని వెల్లడించారు. 2018 నుంచి తిరిగి కెరీర్‌ మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత బదాయి హో, వీరి దే వెడ్డింగ్‌ ముల్క్‌ వంటి చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతి నిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు నీనా గుప్తా. 

చదవండి: నిజం చెప్పాలంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు