నెక్ట్స్‌ బాండ్‌ ఎవరు?

21 Oct, 2020 04:49 IST|Sakshi
‘నో టైమ్‌ టు డై’ సినిమాలో డేనియల్‌ క్రెగ్, లాషనా లించ్‌

చురుకైన చూపులు, బులెట్లకు ఎదురెల్లే నైజం, దిగాలన్నా, దూకాలన్నా మరో ఆలోచన చేయని ధైర్యం, శత్రువుల ఎత్తుల మీద ఎక్కిÐð ళ్లే సాహసం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అన్నీ జేమ్స్‌ బాండ్‌కి నిర్వచనాలే. ‘మై నేమ్‌ ఈజ్‌ బాండ్‌. జేమ్స్‌ బాండ్‌. 007’ అంటూ 58 ఏళ్లుగా స్క్రీన్‌ మీద సీక్రెట్‌ ఏజెంట్‌గా ఎన్నో ఆపరేషన్స్‌ విజయవంతం చేస్తున్నాడు బాండ్‌. ఇయాన్‌ ఫ్లెమింగ్‌ సృష్టించిన ఈ సీక్రెట్‌ ఏజెంట్‌ ఆన్‌ స్క్రీన్‌ సూపర్‌ సక్సెస్‌ఫుల్‌. 58 ఏళ్లలో 25 బాండ్‌ చిత్రాలు తెరకెక్కాయి. ఆరుగురు హీరోలు జేమ్స్‌ బాండ్‌గా ఈ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. తాజాగా మరోసారి బాండ్‌ ముఖం మారనుంది. జేమ్స్‌ బాండ్‌గా కొత్త హీరో తెరమీదకు రానున్నాడు. 

ఇప్పటివరకు కనిపించిన బాండ్‌లు
1962లో విడుదలయిన ‘డాక్టర్‌ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్‌ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్‌ రష్య విత్‌ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్‌ ట్వైస్, డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్‌ కానరీ. ఆ తర్వాత  ‘ఆన్‌ హర్‌ మెజెస్టిక్‌ సీక్రెట్‌ సర్వీస్‌’ సినిమాలో జార్జ్‌ లెజెన్బీ బాండ్‌ అయ్యారు. ఆ తర్వాత రోజర్‌ మూరే రికార్డు స్థాయిలో ఏడు సినిమాల్లో బాండ్‌ అవతారమెత్తారు. ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై, ది మ్యాన్‌ విత్‌ ది గోల్డెన్‌ గన్, ది స్పై హూ లవ్డ్‌ మీ, మూన్‌రాకర్, ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ, ఆక్టోపస్సీ, ఏ వ్యూ టు ఏ కిల్‌’ సినిమాల్లో రోజర్‌ మూరే నటించారు. ఓ రెండు సినిమాల్లో (ది లివింగ్‌ డే లైట్స్, లైసెన్స్‌ టు కిల్‌) తిమోతీ డాల్టన్, నాలుగు సినిమాల్లో (గోల్డెన్‌ ఐ, టుమారో నెవర్‌ డైస్, ది వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్, డై అనదర్‌ డే) పీర్స్‌ బ్రోస్నన్‌ బాండ్‌గా కనిపించారు. ప్రస్తుతం బాండ్‌గా ఉన్న డేనియల్‌ క్రెగ్‌ తాజాగా విడుదలవనున్న ‘నో టైమ్‌ టు డై’తో కలిపి ఐదు సినిమాల్లో జేమ్స్‌ బాండ్‌ పాత్రలో కనిపించారు. ‘కాసినో రాయల్, క్వాంటమ్‌ ఆఫ్‌ సోలస్, స్కై ఫాల్, స్పెక్ట్రే’ గతంలో ఆయన బాండ్‌గా చేసిన సినిమాలు. ‘నో టైమ్‌ టు డై’ విడుదలకు సిద్ధమవుతోంది.

నవంబర్‌లో ప్రకటన?
బాండ్‌ 25వ సినిమా ‘నో టైమ్‌ టు డై’ విడుదల సందర్భంగా నెక్ట్స్‌ బాండ్‌  ప్రకటన ఉంటుందని టాక్‌. జూన్‌లో టామ్‌ హార్డీ బాండ్‌ పాత్ర కోసం ఆడిషన్‌ చేశారని టాక్‌. తదుపరి బాండ్‌ ఆయనే అని హాలీవుడ్‌ పత్రికలు రాసేస్తున్నాయి. ‘మ్యాడ్‌ మాక్స్‌ ఫరీ రోడ్, ది డార్క్‌ నైట్‌ రైసస్, వెనమ్, ది రెవనంట్‌’ వంటి సినిమాల్లో పాపులారిటీ పొందారు హార్డీ. మరి రాబోయే కొత్త బాండ్‌ ఈ జేమ్స్‌ బాండ్‌ ఇమేజ్‌ను ఎలా ముందుకు తీసుకెళతాడన్నది కాలమే చెబుతుంది.

బాండ్‌ రేసులో ఎవరున్నారు?
‘ఇక నేను బాండ్‌ సినిమాల్లో నటించను’ అని డేనియల్‌ క్రెగ్‌ ప్రకటించేశారు. మరి.. తదుపరి బాండ్‌ చిత్రాల్లో జేమ్స్‌ బాండ్‌ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్‌ నటులు టామ్‌ హార్డీ, టామ్‌ హిడిల్స్‌టన్, ఇద్రిస్‌ ఎల్బా వంటి నటులు నెక్ట్స్‌ బాండ్‌గా కనిపించేందుకు రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్‌ ఉందని హాలీవుడ్‌ టాక్‌. ఈ ముగ్గురూ కాకుండా హెన్రీ కావిల్‌ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. నెక్ట్స్‌ బాండ్‌ ఎవరు?  

మరిన్ని వార్తలు