Kovai Sarala: ఆనాడు హోటల్‌ బయట నిల్చుని ఏడ్చిన కోవై సరళ.. పదో తరగతిలోనే గర్భిణీగా.. పెళ్లెందుకు చేసుకోలేదంటే?

24 Sep, 2023 11:49 IST|Sakshi

కోవై సరళ.. చాలామందికి ఈ పేరు వినగానే పెదాలపై చిన్నటి చిరునవ్వు వస్తుంది. బ్రహ్మానందంతో జత కట్టి ఈమె పండించిన కామెడీకైతే పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే! తమిళంలో వడివేలుకు జంటగా నటించి అక్కడా నవ్వుల రసాన్ని పంచింది. ఉత్తమ హాస్యనటిగా రెండు నందులు సహా అనేక అవార్డులు అందుకుంది. రాష్ట్రస్థాయిలోనూ బోలెడన్ని పురస్కారాలు అందుకున్న ఈ నటి తన జీవితంలో మాత్రం తోడు కావాలనుకోలేదు. అసలు తన సినీప్రస్థానం ఎలా మొదలైంది? ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిందో చూద్దాం..

ఆయన ప్రశ్నలకు వణికిపోయిన కోవై సరళ
ఆరో తరగతి చదువుతున్నప్పుడు కోవై సరళ తన అభిమాన నటుడు ఎమ్‌జీఆర్‌ను చూసేందుకు కోయంబత్తూరులోని హోటల్‌ బయట నిలుచుంది. స్కూల్‌ డ్రెస్‌లో రెండు జళ్లు వేసుకుని ఉన్న ఆమె ఎమ్‌జీఆర్‌ను చూడలేకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్‌జీఆర్‌ ఆమెను ఇంటికి పిలిచి మరీ తన గురించి ఆరా తీశాడు. ఏ స్కూలులో చదువుతున్నావని అడిగాడు. కొంత సంతోషం, మరికొంత భయంతోనే అన్నింటికీ సమాధానాలు ఇచ్చుకుంటూ పోయింది. తన మీద పాఠశాలలో ఫిర్యాదు చేస్తాడేమోనని వణికిపోయింది సరళ. కానీ సరిగ్గా నెల రోజులకు సరళ చదువుతున్న పాఠశాలకు ఆమె స్కూల్‌ ఫీజు పంపించాడు ఎమ్‌జీఆర్‌.

పదో తరగతికే గర్భిణీగా
అప్పటినుంచి అతడిని మరింత ఆరాధించింది. తనలాగే వెండితెరపైనా కనిపించాలనుకుంది. అనుకున్నది సాధించింది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే వెళ్లి రత్తం(1979) చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. పదో తరగతికే గర్భిణీగా నటించింది. రెండో సినిమా ముందనై ముడిచ్చులో గర్భిణీ స్త్రీగా యాక్ట్‌ చేసింది. అంత చిన్న వయసులో గర్భిణీగా నటించే సాహసం చేసిందంటే తన అంకితభావం ఎటువంటిదో అర్థమవుతోంది. తనకు వచ్చిన అవకాశాలనల్లా కాదనకుండా చేసుకుంటూ పోయింది. పాత్రలకు ప్రాణం పోసింది.. తన కామెడీతో సినిమాలను విజయపథం వైపు నడిపించింది. ఎన్నో వందల సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ బుల్లితెరపై టీవీ యాంకర్‌గా, జడ్జిగానూ వ్యవహరిస్తోంది.

61 ఏళ్లొచ్చినా ఒంటరిగానే..
పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, అఖండ విజయాలు కైవసం చేసుకున్న కోవై సరళ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 61 సంవత్సరాలు. తన కుటుంబంలో కోవై సరళనే పెద్ద.. తన తర్వాత నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. తను సంపాదించిందంతా కుటుంబానికే ఖర్చుపెట్టేది. ఏనాడూ స్వార్థంగా ఆలోచించేది కాదు. చెల్లెళ్లకు దగ్గరుండి పెళ్లి చేసిన ఈ హాస్యనటి వారికి పుట్టిన పిల్లల బాధ్యతను సైతం తన భుజాన వేసుకుంది. తన సొంత ఖర్చులతో వారిని చదివించింది. మనవరాళ్లను కూడా చూసుకుంటోంది. 

వారి కోసం జీవితాన్నే త్యాగం
మరోవైపు నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంది. తన చెల్లెళ్ల కోసం అనునిత్యం ఆలోచింది తన జీవితాన్నే త్యాగం చేసింది. తను కూడా ఇల్లాలిగా మారాలని ఏనాడూ ఆలోచించలేదు. ప్రస్తుతం కోవై సరళ వారి పిల్లలకు, మనవరాళ్లకు తన ప్రేమను పంచుతోంది. ఒంటరిగా ఉండటం కూడా ఈ హాస్యనటికి ఇష్టం. అందుకే ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా మిగిలిపోయిందనీ అంటుంటారు!

చదవండి: డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌.. కోరుకునేది ఒక్కటేనంటున్న గురు హీరోయిన్‌

మరిన్ని వార్తలు