Tollywood: ఇంకా అరువేనా.. ‘కాంతార’ కథలు లేవా?

18 Oct, 2022 18:02 IST|Sakshi

‘కాంతార’.. ఇప్పుడు ఈ కన్నడ చిత్రం గురించి యావత్‌ సీనీ ప్రపంచం చర్చిస్తోంది. ఇందులో స్టార్‌ హీరోలు లేరు.  పాన్‌ ఇండియా కంటెంట్‌ కాదు. కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమా కథ గురించే మాట్లాడుకుంటున్నారు.  ‘అబ్బా.. ఏం తీశాడురా’ అని రిషబ్‌ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే రిషబ్‌ శెట్టి మాత్రం పాన్‌ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాసుకోలేదు. కేవలం కన్నడ ఆడియన్స్‌ మెప్పు పొందడానికే ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ అది పాన్‌ ఇండియా ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. ఇదే కాదు కన్నడకు చెందిన చాలా సినిమాలు.. ఈ మధ్య పాన్‌ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై.. సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. పరభాష అభిమానుల మనసును దోచుకుంటున్నాయి.

ఆ మధ్య విడుదలైన ఛార్లీ 777 మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాలను గెలుచుకుంది. ఓ కుక్కకి, మనిషికి ఉన్న బంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రక్షిత్‌ శెట్టి హీరోగా నటించారు. ఆయన కన్నడలో ఫేమస్‌ కానీ.. పాన్‌ ఇండియా ప్రేక్షకులను పెద్దగా తెలియదు. అయినా ఆయన చిత్రాన్ని అందరూ ఆదరించారు. కారణం కథే. రాజ్‌ బీ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కన్నడ మూవీ ‘గరుడ గమన వృషభ వాహన’ గతేడాది విడుదలై దాదాపు అన్ని భాషల ఇండస్ట్రీలను షేక్ చేసింది. దీనికి కారణం కథే.  ఇవేకాదు.. గతంలోనూ యూటర్న్‌, నాతిచరామి, కావలుదారి, లవ్ మాక్ టెయిల్, దియా లాంటి  కన్నడ చిత్రాలు  అన్ని భాషల ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేశాయి. 

(చదవండి: కాంతార మూవీ రివ్యూ)

ఇక ఒక్కసారి మన టాలీవుడ్‌ని పరిశీలిస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప లాంటి బడా చిత్రాలతో పాటు కార్తికేయ-2 లాంటి చిన్న సినిమా కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాయి. యావత్‌ సినీ ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేశాయి. కానీ ఇది మా తెలుగు చిత్రం అని తెలుగువారు గొప్పగా చెప్పుకునే చిత్రాలు మాత్రం రావడం లేదు. మన ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రాదాలయను దేశానికి చూపించే ప్రయత్నం టాలీవుడ్‌ దర్శకనిర్మాతలు, హీరోలు చేయడం లేదనిపిస్తోంది

మన సినిమా గురించి అందరూ మాట్లాడుకోవాలంటే పాన్‌ ఇండియా ప్రాజెక్టే అయ్యుండాలా? తెలుగులో కొత్త కథలు లేవా? ఇప్పటికీ  పరభాష చిత్రాలనే అరువు తెచ్చుకోవాలా? మీడియం బడ్జెట్‌లో ‘కాంతార’లాంటి సినిమాను మనం తెరకెక్కించలేమా? దర్శకనిర్మాతలు అటువైపు ఎందుకు ఆలోచించడం లేదు?  పోనీ బడా హీరోలు అయినా ఒక్క అడుగు ముందుకేసి ప్రయోగాలు చేస్తున్నారా? అంటే అదీ లేదు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఇప్పటికీ రీమేకులనే నమ్ముకుంటున్నారు. మరోవైపు.. ఇతర భాషల్లో సంచనాలు సృష్టిస్తున్న సినిమాల్ని ఇక్కడ డబ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు నిర్మాతలు.  దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కన్నడ, మలయాళ, తమిళ మాదిరి టాలీవుడ్‌లో కూడా ప్రయోగాత్మక చిత్రాలు రావాలి. భారీ బడ్జెట్‌తో గ్రాండియర్ గా, విజువల్ ఎఫెక్ట్స్‌ తో తీస్తేనే భారీ వసూళ్లు వస్తాయన్న అపనమ్మకాల్ని పోగొట్టాలి. కొత్త కథలను ఎంకరేజ్‌ చేస్తే టాలీవుడ్‌ రేంజ్‌ మరోస్థాయికి పెరగడం ఖాయం.

మరిన్ని వార్తలు