క్రిస్‌ ఐ యామ్‌ సారీ.. బహిరంగ క్షమాపణలు చెప్పిన విల్‌ స్మిత్‌

30 Jul, 2022 09:19 IST|Sakshi

94వ ఆస్కార్‌ అవార్డుల ఈవెంట్‌ వేదికగా కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ చెంప పగలకొట్టిన ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పాడు స్టార్‌ నటుడు విల్‌ స్మిత్‌. ఈ ఘటనపై బహిరంగంగా స్మిత్‌ స్పందించడం ఇదే మొదటిసారి. 


ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో.. వేదికపైకి వెళ్లి మరీ హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్‌ రాక్‌ చెంప పగలకొట్టాడు విల్‌ స్మిత్‌. అయితే క్రిస్‌ నవ్వులతో అప్పటికప్పుడు ఆ ఘటన ఒక సరదా విషయంగా అంతా అనుకున్నారు. కానీ, కొన్ని గంటల్లోనే అదొక సంచలనం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి.. అకాడమీకి, ఆస్కార్‌ నామినీలకు మాత్రమే ప్రత్యేకంగా విల్‌ స్మిత్‌ క్షమాపణలు తెలియజేసిన విషయం అందరికీ తెలుసు. 

ఆ తర్వాత క్రిస్‌ రాక్‌ పేరును ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో బహిరంగ క్షమాపణలు చెప్తూ ఓ పోస్ట్‌ ఉంచాడు. అయితే.. ఇప్పుడు నేరుగా క్రిస్‌ రాక్‌కు క్షమాపణలు చెప్తూ ఒక వీడియోనే ఉంచాడు. ఆస్కార్‌ స్పీచ్‌లో చెంప దెబ్బ ఘటనపై ఎందుకు స్పందించలేదు అని ఓ ప్రశ్న ఎదురైంది స్మిత్‌కు. దానికి స్పందించిన విల్‌ స్మిత్‌.. ఘటన తర్వాత క్రిస్‌ రాక్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ, అతను మాట్లాడేందుకు ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని విల్‌ స్మిత్‌ తాజా వీడియోలో వివరించాడు. క్రిస్‌ రాక్‌ ఇప్పుడు అందరి ముందు చెప్తున్నా. నీకు నా క్షమాపణలు. ఇది చాలదని నాకు తెలుసు. నువ్వు ఎక్కడంటే అక్కడ నీతో మాట్లాడడానికి నేను రెడీ. ఐ యాస్‌ సారీ. నీకే కాదు నీకుటుంబానికి, ఆస్కార్‌ కమిటీకి, నామినీలకు, నా వల్ల ఇబ్బంది పడ్డా నా కుటుంబానికి కూడా క్షమాపణలు అని విల్‌ స్మిత్‌ తెలిపాడు.

విల్‌ స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌  ‘షేవ్‌తల’ను ఉద్దేశించి.. జీఐ జేన్‌ అంటూ జోక్‌ చేశాడు క్రిస్‌ రాక్‌. దీంతో మండిపోయిన విల్‌ స్మిత్‌.. ఊగిపోతూ స్టేజ్‌ మీదకు వెళ్లి క్రిస్‌ రాక్‌ దవడ పగలకొట్టాడు. ఈ ఘటన విమర్శలకు దారి తీయడంతో ఆస్కార్‌ కమిటీలో తన సభ్యత్వానికి విల్‌ స్మిత్‌ రాజీనామా చేయగా.. మరోవైపు వేడుకలకు హాజరు కాకుండా అతనిపై నిషేధం(కొన్నేళ్లైనా) దిశగా ఆలోచనలు చేస్తోంది అకాడమీ కమిటీ.  

నటుడు విల్‌ స్మిత్‌(53)  94వ ఆస్కార్‌ వేడుకల్లో ‘కింగ్‌  రిచర్డ్‌’ సినిమాకుగానూ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

A post shared by Will Smith (@willsmith)

మరిన్ని వార్తలు