ఆ రైటర్స్‌ లేకుండా హిట్టు కొట్టలేరా? సక్సెస్‌ ఫార్మాలా మిస్‌ అవుతుందా?

25 Mar, 2023 16:47 IST|Sakshi

డైరెక్టర్స్ విజయం వెనుక వారి టాలెంట్ ఎంత వుంటుందో..అంతకు మించి రైటర్స్ సపోర్ట్ వుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటింగ్ తెలిసిన డైరెక్టర్స్ తక్కువ మంది ఉంటారు. అందుకే డైరెక్టర్స్ చాలా మంది.... స్టోరీతో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయగల మంచి రైటర్స్ ను తమ టీమ్ లో వుండేలా ప్లాన్ చేసుకుంటారు. రైటర్ ప్లస్ డైరెక్టర్ కాంబినేషన్ వర్కౌవుట్ అయితే హిట్ సినిమా గ్యారెంటీ. అలా సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ చాలా మంది వున్నారు.

వీరిలో ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు కూడా ఉన్నాడు. అందుకే ఏ డైరెక్టర్ తనకి సెట్ అయిన రైటర్‌ను మిస్ చేసుకోవాలనుకోడు..రైటర్ మారితే ఆ డైరెక్టర్ తనని తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.సేమ్ స్టిట్యూవేషన్ లో వున్న డైరెక్టర్ నక్కిన త్రినాధ్‌ రావు ఇప్పుడు సోలోగా సినిమా చేయబోతూ ..తన అదృష్టాన్ని చెక్ చేసుకోబోతున్నాడు.

టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్స్ రైటర్స్‌తో పాటు సక్సెస్ కూడా మిస్ చేసుకున్నారు. ఎందుకంటే టాలీవుడ్‌లో రైటర్స్ డిమాండ్ పెరిగిపోయింది. ఒకప్పుడు హీరోలందరూ కథల విషయంలో డైరెక్టర్స్ పై ఆధారపడే వారు. ఇప్పుడు హీరోలు రూట్ మార్చారు. రైటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో స్క్రిప్ట్, స్క్రిన్ ప్లే డిస్కషన్స్ లో హీరోల జోక్యం పెద్ద గా వుండేది కాదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. హీరోలు స్టోరీ తో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై కూడా చాలా ఫోకస్ పెడుతున్నారు.

అందుకే రైటర్స్ కి డిమాండ్ పెరిగిపోయింది. స్టోరీ ఫిక్స్ అయిన తర్వాతే హీరోలు డైరెక్టర్ గురించి ఆలోచిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిన దర్శకులు ..ఇప్పుడు సరైన రైటర్స్ లేక ఫెయిల్ అవుతున్నారు. గతంలో డైరెక్టర్ విజయ్ భాస్కర్ వెనుక త్రివిక్రమ్ రైటర్‌గా  ఉండేవాడు. త్రివిక్రమ్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్న తర్వాత విజయ్‌ భాస్కర్ డైరెక్టర్‌గా ఒక హిట్ కూడా అందించలేకపోయాడు.

ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల..రైటర్స్ కోన వెంకట్, గోపి మోహన్ తో కలిసి ఉన్నంత కాలం హిట్ సినిమాలు తీశాడు. వారితో విడిపోయిన తర్వాత శ్రీనువైట్ల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. అలాగే దేశం గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు. శంకర్ టీమ్ లో సూజాత రంగరాజన్ అనే గొప్ప రైటర్ ఉండేవాడు. ఆయన రోబో సినిమా సమయంలో చనిపోయారు. ఆ తర్వాత శంకర్ సినిమా కథల్లో బలం తగ్గిపోయిందనే మాట వినిపిస్తుంది.

అలాగే డైరెక్టర్ త్రినాథరావు నక్కిన, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ కాంబోలో వచ్చిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా లాంటి సినిమాలు విజయం సాధించాయి. అయితే ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్నాడు. కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ కి డైరెక్టర్ గా తన మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో త్రినాధరావు నక్కిన ఇప్పుడు సోలోగా సినిమా చేయాల్సి వస్తోంది. ధమాకా హిట్ తర్వాత ఐరా క్రియేషన్స్లో ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు. మరి ఇన్నాళ్లు కలిసి వర్క్ చేసిన రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ లేకుండా నక్కిన త్రినాధరావు ఈ సినిమా తో సక్సెస్ అందుకుంటాడో లేదా చూడాలి.

మరిన్ని వార్తలు