The Kashmir Files Movie: డైరెక్టర్‌ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ

12 Mar, 2022 13:12 IST|Sakshi

A Women Cried After Watching The Kashmir Files Movie: సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్‌ దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. బాలీవుడ్‌ దిగ్గజ నటులు అనుపమ్‌ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. 1990లో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందింది ఈ సినిమా. ఈ సినిమా మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చింది హర్యానా ప్రభుత్వం. హర్యానా ప్రభుత్వపు అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 'ది కశ్మీర్‌ ఫైల్స్‌ అనే సినిమాకు హర్యానా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుంది' అని ట్వీట్‌ చేసింది. 
 


ఈ విషయంపై మూవీ డైరెక్టర్‌ వివేక్‌ అగ్ని హోత్రి స్పందించారు. తన సినిమాకు పన్ను మినహాయింపు చేసినందుకు హర్యానా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్‌ సురేష్‌ రైనా తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్‌ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్‌ వివేక్‌, నటుడు దర్శన్‌ కుమార్‌ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్‌, దర్శన్ కుమార్‌ సైతం కంటతడి పెట్టుకున్నారు. 

మరిన్ని వార్తలు