దర్శకుడు శంకర్‌తో ఒక్క ఫొటో దిగాలనుకున్నా 

1 Jul, 2022 14:45 IST|Sakshi
శంకర్‌తో సాయిమాధవ్‌ బుర్రా 

ఇప్పుడు ఆయన సినిమాకు మాటలు రాస్తున్నా  

నటుడు, దర్శకుడు అర్జున్‌ తొలి తెలుగు సినిమాకూ అవకాశం  

నా కథ, స్క్రీన్‌ప్లేతో త్వరలో చిత్రాలు  

తొలినుంచీ ఎన్టీ రామారావు ఆరాధకుడిని  

ఊహ తెలిసినప్పటి నుంచి కమ్యూనిస్టునే  

స్టార్‌ రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా

సాక్షి, గుంటూరు(తెనాలి): సాయిమాధవ్‌ బుర్రా.. తెలుగు సినిమాకు స్టార్‌ రైటర్‌. లెజండరీ దర్శకుల చిత్రాలెన్నింటికో తన మాటలతో వన్నెలద్దెన రచయిత. ఆయన రాసిన మాటలు బాక్సాఫీసు వద్ద తూటాల్లా పేలడమే కాదు.. ప్రజల నోళ్లల్లో నిత్యం నానుతున్నాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ విజయానందంలో ఉన్న సాయిమాధవ్‌ సుప్రసిద్ధ దర్శకుడు శంకర్‌ సినిమాతోపాటు నటుడు, దర్శకుడు అర్జున్‌ తొలిసారిగా తెలుగులో తీస్తున్న సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు. సాయిమాధవ్‌ స్వస్థలం తెనాలి అన్న విషయం తెలిసిందే. ఏటా ఆయన ఇక్కడ జాతీయస్థాయి సాంఘిక, పద్యనాటక పోటీలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ శత జయంతి మహోత్సవాలను జరుపుతున్నారు. ఈ సందర్భంగా  ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  

‘జెంటిల్‌మెన్‌’ చూశాక దర్శకుడు శంకర్‌ను ఒక్కసారైనా కలిసి ఫొటో దిగితే చాలనుకున్నాను. తెలుగులో తొలిసారిగా ఆయన తీస్తున్న సినిమాకు సంభాషణలు రాస్తానని ఊహించలేదు. జరుగుతోంది. సింపుల్‌గా ఉండే గొప్ప మనిషి శంకర్‌. అర్జున్‌ తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా తెలుగులో తీస్తున్న మొదటి సినిమాకు అవకాశం రావటం సంతోషం. 

ప్రసిద్ధ దర్శకులతో విభిన్నమైన సినిమాలకు పనిచేస్తున్నందుకు గర్వపడటం లేదు. వారి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవచ్చని సంతోషిస్తున్నా. క్రిష్, రాజమౌళి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఇప్పుడు శంకర్‌ దగ్గర మరికొన్ని నేర్చుకున్నా. అర్జున్‌ సినిమా స్క్రిప్టు అద్భుతం.  

చదవండి: (విజయ్‌ దేవరకొండ ఫ్యాన్‌ గర్ల్‌.. వీపుపై టాటూ.. వీడియో వైరల్‌)

ఏ సినిమాకైనా బడ్జెట్‌ను కథ నిర్ణయిస్తుంది. సంసారం సాగరం సినిమాకు భారీ బడ్జెట్‌ అవసరముండదు. రాజమౌళి, శంకర్‌ కథలకు బడ్జెట్‌ ఎక్కువ. నా వరకు కథ, ప్రొడక్షన్‌ హౌస్, రెమ్యూనరేషను ముఖ్యం. ఇటీవల ఆకాశవాణి, గమనం సినిమాలకు రాశాను. కథలు నచ్చాయి. చేశాను. కమ ర్షియల్‌గా ఆలోచిస్తే అలాంటి సినిమాలు తీయరు. అలాంటి ప్రొడక్షన్స్‌లో పనిచేయటం నాకు అవసరం. స్వార్థమే. చిన్న సినిమా చేస్తే త్యాగాలు చేసినట్టేమీ కాదు. నేను రాసే కథలూ త్వరలో వెండితెరపై రాబోతున్నాయి.
 
చిన్ననాటి నుంచి నాటకరంగంతో అనుబంధముంది. తల్లిదండ్రులు నాటక కళాకారులే. హైస్కూలు రోజుల్లోనే ముఖానికి రంగేసుకున్నా. బుల్లితెరకు రచనలు చేయడం సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. నాటకానికి చేతనైనంత చేయాలనే కళల కాణాచి పేరుతో జాతీయస్థాయి నాటకోత్సవాలను జరుపుతున్నాం. భారీ పారితోషికాలతో వీణా అవార్డులు ఇస్తున్నాం.  

నేను ఎన్టీఆర్‌ ఆరాధకుణ్ణి. అందుకే తెనాలిలో ఆయన శతజయంతి మహోత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తున్నా. వారంలో ఐదురోజులు ఎన్టీఆర్‌ సినిమాలను ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. వారాంతాల్లో సదస్సులు, ఎన్టీఆర్‌ పేరుతో రంగస్థల, సినిమా అవార్డులను బహూకరిస్తున్నాం. ఎన్టీఆర్‌ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. నేను స్వతహాగా కమ్యూనిస్టును.

మరిన్ని వార్తలు